తెలంగాణా విభజనవాదులు: ప్రత్యేక రాష్ట్రం కావాలిసిందే. ఎందుకంటే
1) మా వనరుల మీద అధికారం మాకే కావాలి
2) ఎన్నోసార్లు రాజకీయనాకుల చేతిలో మోసపోయాం. దోపిడీలకు గురయ్యాం. ఇక మావల్ల కాదు
3) చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యపడుతుంది
4) తెలుగు వారమైనా మా సంస్కృతి, సాంప్రదాయం వేరు. ఈ బలవంతపు వివాహం నుంచి మాకు విడాకులు కావాలి.
5) నిధులు, వనరుల పంపిణేల్లో, అన్యాయానికి గురి అవుతున్నాం.
6) సమైఖ్యాంధ్రా కోరుకునే వాళ్ళకి నిజంగా హైదరాబాదే కావాలి. హైదరాబాదు తెలంగాణాలో అంతర్భాగం. ఇది నైజాముల కాలంనుంచే అభివృద్ధి చెందిన నగరం. మీరొచ్చి కొత్తగా ఊడబొడించింది లేదు.
భౌగోళికంగా వేరైనా మానసికంగా కలిసుందాం (లేదా అందుకు ప్రయత్నిద్దాం)
సమైఖ్యాంధ్రా కోరుకునే వారు:
1) అసలు విడిపోవడమన్నదే పరిష్కారం కాదు. కలిసి ఉంటే కలదు సుఖం. చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యం (ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో) కాకపోవచ్చు.
2) రాష్ట్ర విభజన వల్ల అనర్ధాలు ఎన్నో. ఇది రాష్ట్ర సమస్యేకాదు. జాతీయ భత్రతో ముడిపడి ఉన్న సమస్య కూడా. నక్సాలిజం, తీవ్రవాదం, వేర్పాటువాదం వంటివి మరింత ప్రజ్వరిల్లవచ్చు.
3) ఇన్నాళ్ళు మీ ప్రాంత రాజకీయనాకులు వెలగబెట్టిందేంటి? ఇది రాజకీయనాయకులు స్వప్రయోజనాలకోసం, తమ ఉనికి కోసం తిరగదోడిన సమస్య. అయినా రాయలసీమ వెనకబడి లేదా? ఉత్తరాంధ్రా వెనకబడిలేదా. మీ వెనకబాటుదనానికి అంధ్రావాళ్ళని దోపిడీ దారులనడం, నిజంగా గర్హించవలసిన విషయం.
4) ఇక ముఖ్యంగా, హైదరాబాదు లో నివాసం, వ్యాపారాలు వృద్ధి చేసుకున్నవారి పరిస్థితి ఏంటి. వాళ్ళకి భద్రత ఏది. మీరిచ్చే వాగ్దానాలు తుంగలో తొక్కరన్న నమ్మకమేమిటి. ఇన్నాళ్ళూ మేము కూడా, హైదరాబాదు అభివృద్ధిలో పాలుపంచుకున్నాం. మేము పోషించినా హైదరాబాదు మాకు లేకపోవడం అన్యాయం.
5) ఒకవేళ తెలంగాణా వచ్చిన పరిస్థితులలో, ముఖ్యంగా, నీళ్ళ దగ్గర, ఇతర రాష్ట్రాల్లాతోవాళ్ళాలాగే తగవులాడుకోవాలి.
ఇప్పుడు ఎలా వుంది అంటే, కరవమంటే కప్పకి కోపం, విడవ మంటే పాము కోపం లాగ తయరయ్యింది. అసలు కథ ఇంత దూరం వచ్చిన తరువాత, కలిసున్నా విడిపోయినట్టే. ఈ పీటముడి ఇప్పడానికి, నాకు హైదరాబాదు, జలవనరులపై ఆధిపత్యం ప్రధాన అడ్డంకులుగా కనిపిస్తున్నాయి.

కాబట్టి నేను సూచించే పరిష్కారం, రాష్ట్రా విభజన ముఖ చిత్రాన్ని మార్చి, విభజన చేయటం. కాకపోతే, రెండు సమూహాలూ పట్టువిడుపులు ప్రదర్శించాలి. (ప్రక్క పటం చూడాండి. నీలి రంగు గీత కొత్త విభజన రేఖని సూచిస్తుంది)
1) రాయలసీమ, కోస్తాంధ్రలలో, మెహబూబ్నగర్, సగం రంగారెడ్డిని ని కలపాలి. అంటే, తెలంగాణా ఒక జిల్లాని కోల్పోవాలి. అలాగే సగం రంగారెడ్డి కూడా. సీమాంధ్రలు, విభజనకి అంగీకరించాలి.
2) హైదరాబాదు ఉమ్మడి రాజధాని గా చెయ్యాలి
3) రెండు కొత్త రాష్తాల మధ్య కొన్ని ప్రత్యేక అవగాహనలు ఉండాలి (వాహనాలు, జలవనరులు, రవాణా ఇలాంటి విషయాల్లో)
4) క్రిష్ణా పై అధిక హక్కులు సీమాంధ్రకి వస్తాయి. గోదావరిపై నియంత్రణ తెలంగాణాకి లభిస్తుంది.
5) నాగార్జునసాగర్ పై రెండు రాష్ట్రాలకి హక్కులు ఉండాలి.
6) హైదరాబాదు ని ఫ్రీజోన్ గా కాకుండా, ఫ్రోజెన్ జోన్ గా ప్రకటించాలి. ప్రత్యామ్నాయంగా మూడు ప్రాంతాల్లో (తెలంగాణా, రాయలసీమ, కోస్తాల్లో ఒకటి చొప్పున), మూడు ప్రాంతాలని అభివృద్ధి పరచాలి (అభివృద్ధి వికేంద్రీకరణ కోసం)
అలోచించవలసిన విషయం:
తెలంగాణా వాదులు: ఇప్పుడు మీరు మహబూబ్ నగర్, సగం రంగారెడ్డిని కోల్పోతున్నారు. హైదరాబాదు ని పంచుకుంటున్నారు. ఇప్పుడు మీకు అర్ధమవుతోడా, విడిపోవడం, విభజనలో బాధ? మీరు నిజంగా, తెలంగాణా అభివృధి కాంక్షించేవారే అయితే, మహబూబ్ నగర్ సీమాంధ్రలో వున్నా, తెలంగాణాలో ఉన్నా పెద్ద తేడా ఉండదు, ఇప్పుడు రెండూ చిన్నా రాష్ట్రాలే కాబట్టి.
తెలంగాణాలో, గోదావరీ పరివాహక ప్రాంతమే ఎక్కువ కాబట్టి, దానిపై ఎగువ నియంత్రణ మీచేతికిందకే.
సమైఖ్యవాడులు: దీనివలన, హైదరాబాదు పై అనవసర ఆందోళణలు అక్కర్లేదు (ఉమ్మడి రాజధాని కాబట్టి). క్రిష్ణా పై అధిక నియంత్రణ వస్తుంది. ఏదో ఒకటి వొదులుకోక తప్పదు కాదా, విభజన అన్న తరువాత. అసలు కొంతమంది తెలంగాణావాదుల వాదన చూస్తే, వాళ్ళ ఆరోపణలకి మనసు విరిగిపోతుండి. కలిసుండి వేర్వేరుగా ఉండేకన్నా, విడిపోయి కలిసుండడమే ఉత్తమమేమో.
(ఇది ఒక ప్రతిపాదన మాత్రమే. నాకున్న సమాచారంతో ఈ సూచన చేయడం జరిగింది. ఎవరి మనసు నొప్పించినా క్షమించ గలరు. ఈ టపా పై నేను మరి ఇక వ్యాఖ్యానించను.)