వీడియోలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వీడియోలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఆగస్టు 2010, శనివారం

జనగణమన (కొత్త సంకలనం)

రెహ్మాన్ "జనగణమన" స్వరకల్పన అనేక రూపాల్లో శబ్దీకరించబడింది. వాయిద్యాలతో మాత్రమే, గాత్రంతో మాత్రమే ఇలా. వాటిని మూలంగా తీసుకొని, రూపొందించినదే ఈ క్రింది వీడియో. ఉదాహరణకి, గాత్రంవెర్షన్ తో ప్రారంభమై, మధ్యలో వాయిద్యాలతో కూడుకొన్న "జనగణమన" కిమారి, చివరికి "జయ జయ జయహే" అంటున్నప్పుడు గాత్రం వెర్షన్ తో ముగుస్తుంది. వీడియో కు మూలం - వందేమాతరం, బేక్ టూ స్కూల్, + మరికొన్ని వీడియోలు.


- స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో

గమనిక:- ఇందులో నోబెల్ పురస్కార గ్రహీత నార్మన్ బోర్లాగ్ ని కూడా చూడొచ్చు. పతాకావిష్కరణకి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసారు. కాబట్టి ఈపాటికి మీరు గ్రహించే ఉంటారు, ఈ వీడియో కొన్నాళ్ళ క్రితం తయారుచేసినదని)

3, ఆగస్టు 2010, మంగళవారం

మరపురాని మొదటి, "పెళ్ళివీడియో"

విరామాన్ని జాగ్రత్తగా గమనించండి. "మొదటి, పెళ్ళివీడియో". "మొదటి పెళ్ళి" - వీడియో కాదు :). యూట్యూబ్ ఇంకా ప్రపంచానికి "పూర్తిగా" తెలియనప్పుడె మా వీడియో వికారం మొదలైంది. అది కూడా, ఇండియా అసోసియేషన్ అధ్యక్షపదవికి జరిగే వార్షిక ఎన్నికలతో. అప్పటినుంచి కొనసాగుతూ, మొత్తం ఒక 22 వీడియోలు రూపొందించడంలో ఏదో ఒక పాత్రపోషించాను. వీటన్నిటికీ విభిన్నమైనదే పెళ్ళివీడియో కి వీడియోగ్రాఫర్ గా పనిచెయ్యడం.
"మా పెళ్ళి ఫలానా తారిఖున జరగబోతోంది. వీడియోగ్రాఫర్ ని కుదుర్చుకోవడానికి సమయం సరిపోలెదు. అందుకని మీ క్లబ్ లో ఎవరైనా అందుబాటులో ఉంటే నన్ను సంప్రదించండి"
అని పెళ్ళికూతురినుంచి ఒక ఈమైలు స్టూడెంటు ఫిల్మ్ క్లబ్ మైలింగ్ లిస్ట్ కి వచ్చింది. అప్పటివరకు చేసిన వాటితో విసుగు రావడం వలన, ఈ పెళ్ళికి వీడియోగ్రాఫర్ గా పనిచేస్తే పుణ్యం-పరమార్ధం అనుకుంటూ..
"నే చేస్తాను. కానీ, నా దగ్గర ఉన్నది - ఒక డొక్కు కెమారా. అతిసాధారణంగా ఉంటుంది. ఎడిటింగ్ చెయ్యడానికి సమయంలేదు. వీడియో ఒక జ్ఞాపికంగా మాత్రమే ఉపయోగపడుతుంది గానీ, అంతకుమించి సీను ఉండదు. మీరు వీటికి ఒప్పుకుంటే, మీతో మరిన్ని వివరాలు మాట్లాడతాను"
అని టపా పెట్టను. వాళ్ళకి ఇంకెవరూ దొరకకపోవడంతో, నన్ను వాళ్ళ వీడియోగ్రాఫర్ గా అంగీకరించడం తప్పించి, వేరే గత్యంతరం లేకపోయినట్టుంది .

పెళ్ళికూతురిని కలిసి, ఎక్కడ, ఏమిటి లాంటి విషయాలని కనుక్కొన్నాను. బహుసా అది సెమెస్టర్ ముగుస్తున్న సమయం కావచ్చు, ఆవిడకి మాట్లాడ్డానికి కూడా తీరికలేకపోయింది. ఏమైనా ప్రత్యేకమైన సూచనలిస్తుందేమనని, ఆశించి భంగపడ్డాను. ఇంక సరే అని - నా రిసెర్చ్ మొదలుపెట్టా. పెళ్ళి వీడియో తీసేటప్పుడు ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా, అమెరికన్ల వివాహంలో ముఖ్యఘట్టాలేంటి, లాంటివన్నె రాసి ఒక లిస్ట్ పెట్టుకున్నాను. నాకున్న బడ్జెట్లోనే - ఒక ట్రైపాడ్, ఒక బుల్లి లైటు, పవర్ ఎక్స్టెంషన్ కార్డు, బేటరీపేక్ - ఇవన్నీ జోలెలో వేసుకొని, వివాహ వేదిక కి చేరుకున్నాను. ఇది, యూనివర్సిటీలోనే ఉండే, ఆల్ ఫైత్ చాపెల్ - బెస్ట్ మేన్, బెస్ట్ వుమెన్, చిన్నపిల్లలు తెల్లగౌన్లలో గులాబీ పువ్వులు పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ - కొంచం సందడిగానే ఉంది.

నేను పెట్టుకున్న కార్డినల్ రూల్ - మన తెలుగు పెళ్ళిళ్ళలో లాగ, వీడియోగ్రాఫర్ కథానాయకుడు కాకూడదు. ఏది చేసినా తెరవెనుకే ఉండాలి- అని. అందుకు తగ్గట్టే, సెంటర్ స్టేజికి ఆటొక చివర ఇటొక చివర వాళ్ళదగ్గరున్న గుప్తులకాలంనాటి రెండు కెమారాలని అమర్చి, నేను మధ్యలో భుజంమీద కెమేరా పెట్టుకొని లో ప్రొఫైల్ లో కూర్చొన్నాను. నేను రాసుకొన్న లిస్ట్ లో జరుగుతున్న అంశాలు ఒకటి ఒకటి అవుతున్నాయి, అంతా సవ్యంగా జరిపోతోదని అనుకుంటుండగా, అప్పుడు తగిలింది మొదటి షాక్. వాళ్ళా ఇంటి పెద్దావిడొకామె, చేతిలో బ్రెడ్ పట్టుకొని, మంత్రంజల్లిన నీళ్ళో, వైనో జల్లుతూ, ఏవో వల్లిస్తొంది. ఆ బ్రెడ్ చూడగానే అర్ధమయ్యింది, ఇది క్రిస్టియన్ల పెళ్ళి కాదు, యూదులపెళ్ళని ( హిస్టరీ చానల్ లో బ్రెడ్ గురించి, చెప్తూ, ఇలా జడలా అల్లే బ్రెడ్ జూయిష్ సాంప్రదాయమని, చెప్పండం గుర్తుకొచ్చింది). మరి వీళ్ళ ఆచారంలో ముఖ్య ఘట్టాలేంటో, ఎక్కడ ఏ షాట్స్ తీయ్యాలో అన్న ప్లేనింగ్ తప్పింది. ఇంక చేసేదేమీలేక, సందర్భానుసారం, స్టిల్ ఫొటోగ్రాఫర్ ని గమనిస్తూ, లాగించేసాను. ఇదంతా దాదాపు ఒక గంటన్నర పట్టింది. చివర్లో ఇద్దరితరపు కుటుంబ సభ్యుల గ్రూప్ ఫొటోతో పెళ్ళి అయిపించేసారు.

ఇంక మిగిలింది డిన్నర్. ఇది మెమోరియల్ స్టూడెంట్ సెంటర్ లో. టేబుళ్ళనీ చాలా నీట్ గా సర్ది ఉన్నాయి. ఎక్కడ చూసినా నలుపే. ఆఖరికి, మూతి-ముడ్డీ తుడుచుకొనే పేపర్ నేప్కిన్స్ కూడా. ఎవడిగోల వాడిది టైపులో అందరి దృష్టి భోజనం మీదే . ఈ నవ దంపతులు మాత్రం ప్రతీ టేబుల్ దగ్గరకి వెళ్ళి అందరినీ పలకరిస్తున్నారు. అతిధులు తెచ్చిన గిఫ్టులని స్వీకరించడనికి ప్రత్యేకంగా ఒక టేబుల్ దగ్గర వారి స్నేహుతులు కాపలా ఉన్నారు. ఇంగ్లిష్ సినిమాల్లో చూపించినట్టు, పెళ్ళికూతురు పూలసజ్జ విసిరితే, ఎవెరో ఒక అమ్మాయి పట్టుకొని తెగ మురిసిపోయింది. తరువాత ఒక వింత ఆచారాన్ని గమనించాను. పెళ్ళి కూతురు కుర్చీలో కూర్చొని ఉంటే, పెళ్ళి కొడుకు వెళ్ళి, ఆమె గౌనులో కిందనుంచి చెయ్యిపెట్టి కితకితలో ఎవో పెట్టాలి. ఎంత లోపలికి చాపితే అంత సరదా కాబోలు. అదేం సరదావో - అంత మంది సమక్షంలోనిన్నూ. తరువాత, ఇద్దరూ కలిసి, డీ.జే పాటకి అనుగుణంగా డాన్స్ చేసారు - అందరూ చప్పట్లు కొడుతూండగా. ఇలా దాదాపు చివరికొచ్చేసాం. అలా అంతమంది అతిధుల్ల్నీ కవర్ చేసుకుంటూ, అధ్భుతంగా డెకరేట్ చేసిన కేక్, పళ్ళు, ఇలాంటివన్నీ వెనక్కి నడుస్తూ తీస్తూ, తీస్తూండగా

కం||
తుళ్ళిపడె నూతన వధువు
భళ్ళున పగల స్మృతిశిఖరపటరాజమ్ముల్
ఘొల్లనె పతి విభ్రాంతిన్.
ఛెళ్ళుమనగ చెంప, ఇల్లు జేరితి తుదకున్.


ఒక్కసారి పెళ్ళికూతురు అదిరి (తుళ్ళి) పడింది. పెళ్ళి కొడుక్కి ఏమైందో కాసేపు అర్ధంకాలేదు. ఒక ఫొటొస్టేండ్ కి నా కాలు తగలండంతో, వాళ్ళిద్దరూ కలుసున్న ఫొటొ (స్మృతిశిఖరపటరాజం) ఒకటి కింద పడి, అద్దం భళ్ళుమని పెద్ద శబ్ధం చేస్తూ విరిగిపోయింది. నా మనసులో వంద తెలుగు సినిమాలు గిర్రుమని వంద రోజులాడినట్టినిపించింది. మీకు తెలుసుగా - ఒక ఫొటొ గోడమీదనుంచి కింద పడి అద్దం పగిలింది - అంటే అర్ధం. అంతా ఒక క్షణం పాటు నిశ్శబ్ధం. అందరి చూపు నా వైపే. పెళ్ళికూతురు నోరెళ్ళబెట్టింది. పెళ్ళి కొడుకు చెంప ఛెళ్ళుమనేట్టు ఒక చూపు చూసి, మళ్ళీ సర్దుకొని, తనే ఆ అద్దం ముక్కలని ఏరడానికి ముందుకొచ్చాడు. ఇద్దరికి క్షమాపణలు చెప్పి, అతని స్నేహితులు కొందరు, నేను కలిసి గాజుపెంకులన్నె ఎత్తి చెత్తబుట్టలో వేసి, నేను కనుమరుగయ్యాను. ఇంక మరి మధ్యలోకి వెళ్ళకుండా జూమ్ తో కానిచ్చేసా. ఇంకో పావు గంటికే మొత్తం కార్యక్రమం అయిపోవడం, గుడ్డిలో మెల్ల. కథానాయకుడు సరే సరి, ఇలా విలన్నో, కమెడియన్నో అయిన ఇంత దారుణమైన అనుభవం జీవతంలో ఇంకెప్పుడూ ఎదురు కాకూడదురా నాయనా, అనుకుంటూ, తలదించుకొని, కాళ్ళీడ్చుకొంటూ, ఇంటికిచేరాను.

మర్నాడు వెళ్ళి వాళ్ళ పెళ్ళి డీ.వీ.డీ. ని పెళ్ళికూతురికి అప్పజెప్తే, చేతిలో ఒక ఇరవై డాలర్లు పెట్టింది. పెట్టిన ఖర్చు కూడా తిరిగిరాలేదు. బహుసా, ఆ ఫొటొ వెల మినహాయించినట్టుంది. ఇలా, నేను పనిచేసిన మొదటి పెళ్ళి వీడియో - అదే, మొదటీ "పెళ్ళి వీడియో" మరచిపోలేని జ్ఞాపకాల్ని మిగిల్చింది. వాళ్ళ సంగతేమో మరి :).

21, మార్చి 2009, శనివారం

రేయి మించెనోయీ రాజా (పేరడీ video)

రేయి మించెనోయీ రాజా,
హాయిగ నిదురించరా, ఆ .....హాయిగ నిదురించరా

వెన్నెల్లు విరెసె, వెతలెల్ల వెలిసె
ఆశల తారలు మిలమిల మెరిసె

తలపుల్లో నీవు, జలకమ్ములాడి
విందారగింపా విచ్చేయవోయి
మమతల్లు కలుపు, మాయల్లు విరుపు
దూరాలు తరగు, మురిపాలు పెరుగు
హాయిగ నీవింక సేవించవోయీ

రేయి ||

సిరులూ, విరులూ, మనకేలనోయి,
రాగం, అనురాగం మనవేకదోయి

కన్నుల్లు మూసి, మనసే తెరచి
కలలేకంటూ విహరించవోయీ
హార్ధికమాంద్యం కలలకుకాదు
కలలకు కొఱతంటు రానేరాదు
హాయిగ నీవింక శయనించవోయి

రేయి మించెనోయీ రాజా,
హాయిగ నిదురించరా, ఆ .....హాయిగ నిదురించరా
ఉమ్.....ఊమ్..... ఊ....ఊ.......


ఈపాట వీడియో రూపంలో ఇక్కడ చూడండి



రచన: దీపిక ఆచళ్ళ, సోమశేఖర్ ధవళ
గాత్రం: దీపిక ఆచళ్ళ
స్వరకల్పన: ఘంటసాల
మాతృక రచన: సముద్రాల
చిత్రం: శభాష్ రాముడు


నేపధ్యం:
నేను, దీపిక (మా ఆవిడ) కలిసి సాయంత్రం "నడక" కని బయలుదేరాం (ఇలా వాకింగ్ కి వెళ్ళడం, జీవితంలో నాకు ఇదే మొదటిసారి). కాస్త దూరం నడిచిన తరువాత, ఏదైనా పాటపాడొచ్చు కదా అని దీపికని ఆడిగాను. సరే అయితే, మీకిష్టమైన "శభాష్ రాముడు" లోని "రేయి మించెనోయి రాజా" పాడతాను అని మొదలుపెట్టాకా, ఇంక ఆపాటకి పారడి మొదలుపెట్టాను (నాకు అంత్యాక్షరీల్లో, ఇలా పాటలని ఖూనీ చెయ్యడం బాగా అలవాటూ). అది ఇలా మొదలయ్యింది

"అలసి సొలసి, ఆయాసం వచ్చి,
త్వరగా ఇంటికి పోదామురండి" అని మాఆవిడ అంటే


"పోపే పోచి, చారే కాచి
వేడిగా ముద్దే తిందాము రండి" అని నేను,

ఇలా కామెడీగా మొదలయ్యి, పైన రాసిన విధంగా రూపాంతరం చెందింది.

3, మార్చి 2009, మంగళవారం

ఆలోచనల కాలుష్యం

మనసు కలుషితమైతే సరైన నిర్ణయాలు తీసుకోలేదు. మరి పరిష్కారం: విచక్షణ, క్షమ, ఓర్పు, సహానుభూతి అనే వడపోత కాగితాలతో వడకట్టండి. ఈ భావాన్ని ప్రతిబింబింస్తూ స్ఫురింపజేస్తూ, తయారు చేసిన ఒక 50s ల లఘువీడియో క్రింద చూడండి:

ఒక మూడు సంవత్సరాల క్రితం, విధ్యార్ధిసంఘం ఎన్నికల సందర్భంలో, war of the videos లో భాగంగా, ఒక 10 పది నిముషాలు చిత్రీకరణకి, ఒక 10 నిముషాలు కూర్పుకి "కష్టపడి" చేసిన వీడియో ఇది :) మళ్ళీ లోక్ సభ, శాశన సభ ఎన్నికలు సమీపుస్తున్నతరుణంలో ఇలా!

30, జనవరి 2009, శుక్రవారం

పరిపూర్ణ పట్టభద్రుడు

లియోనార్డో డావిన్సీ బహుముఖప్రజ్ఞాశాలి. చిత్రకారుడి గా ఎక్కువమందికి తెలిసినా, గొప్ప ఇంజనీరని, మానవ అవయవ నిర్మాణాన్ని కూడా పరిశోధించాడని ఎక్కువమందికి తెలియకపోవచ్చు. అనేక మృతదేహాలని పరీక్క్షించి, తన చిత్రలేఖన చాతుర్యంతో వాటిని శాస్త్రీయంగా గ్రంధస్థం చేసాడు. Proportion of Man అని వ్యవహరింపబడే (ప్రక్క చూపించిన) చిత్రం అనేకమంది ని పరీక్షించిన తరువాత, సగటు (mean) అధారంగా ఒక పరిపూర్ణమానవుని శరీరసౌష్టవం ఎలా ఉండాలి అన్నదానికి సమాధనంగా గీసాడని ఒక వాదన. ఈ చిత్రం మేము తీసిన Proportion of Graduation అనే వీడియో కి ప్రేరణ.

ఇక్కడ graduate అంటే పట్టభద్రుడు. Proportion of Graduation కి దృశ్యరూపం ఇవ్వాలి అంటే, పరిపూర్ణ పట్టభద్రుని లో ఉండాల్సిన లక్షణలు ఏంటి? అది ఎలా సాధ్యం? అన్న ప్రశ్నలకి సమాధాన్ం వెతకాలి( ఇంకా వెతుకుతూనే ఉన్నాం). తెలుసుకొనే ప్రయత్నంలో, ఈ ఉపమానం చూడండి.

ఒక విగ్రహం/శిల్పం తయారు కావాలంటే, శిలతోపాటూ, ఉలి ఇత్యాది పరికరాలని ఉపయోగించి, కఠినమైన శిలకి జీవంపోసి అందమైన శిల్పంగా తయారుచెయ్యగల శిల్పాచార్యుడు కూడా ఉండలి. మరి వీరిద్దరి సంబంధం ఎటువంటిది?

శిల్పంకి ముడి పదార్దం శిలే కదా. అంటే, శిల్పాన్ని ఎవరూ గాల్లోంచో, మరేదో మాయచేసో తయారుచెయ్యలేరు. శిల్పంగా మార్పుచెందగలదు ఏ శిలాఅయినా. కానీ, ఒక అధ్భుత కళాఖండంగా మార్పుచెందాలి అంటే, మారాలనే ఆకాంక్ష శిలకి ఉండడంతోపాటూ, తగిన గురువు చేతిలో పాడాలి. ఉలి ఆటుపోటుల్ని తట్టుకోవాల ఓర్పు, సహనం కావాలి. మరి గురువు లక్షణాలు ఎలా ఉండాలి? తనవద్ద ఉన్న ముడిపదార్ధాన్ని ఎలా మలుచుకోవాలో తెలిసుండాలి. ఉలిని ఓడుపుగా పడుతూ, ఎప్పుడు, ఎక్కడ సుతిమెత్తగా చెక్కాలో, ఎప్పుడు ఎంతమోతాదులో, ఒక్కబాదు బాదాలో తెలుసిఉండాలి. తనఆధీనంలో ఉన్నంతకాలం శిల యొక్క సంపూర్ణభాద్యతవహించాలి.

చివరిగా ఒక masterpiece తయారుకావాలి అంటే ఒక master కావాలి, ఒక piece కూడా కావాలి. పై భావంతో Proportion of Graduaiton వీడియో ని క్రింద చూడండి.

ఇందులో రెండు tracks సమాంతరంగా నడిస్తూంటాయి. అప్పుడే ప్రవేశం లభించిన విద్యార్ధి ఒక పక్క, ఎమీలేని తెల్లకాగింతం ఒక పక్క. తెల్లకాగితం డావిన్సీ వంటి master చేతిలో పడితే, విద్యార్ధి ఒకా అత్యున్నతమైన విశ్వవిద్యాలయం (ఇక్కడ Texas A & M University) లో చేరతాడు. ఇద్దరూ కూడా అత్యంత క్లిష్టమైన పరిస్థితులని విజయవంతంగా ఎదుర్కొంటారు. కాగితం, అద్భుతమైన కళాఖండంగా రూపుదిద్దుకోటే, విద్యార్ధి పట్టభద్రుడై జీవితాన్ని ఎదుర్కోవడనికి సన్నద్ధుడౌతాడు.




Discover the masterpiece within
A & M: Finest craftsmen since 1876

అన్న tag-line తో ముగుస్తుంది.

వీడియో గురించి కొన్ని విశేషాలు:
  • ఇందులో నటించిన అబ్బాయి undergraduate, రష్యన్
  • అసలు footage అంతా shoot చేసేవరకు ఈ concept అనుకోలేదు. దాదాపు editing తోనే ఈ story చెప్పడం జరిగింది
  • నేపధ్యసంగీతం అందించిన వ్యక్తి myspace లో పరిచయం. ఫ్రాన్స్ దేశస్థుడు

13, జనవరి 2009, మంగళవారం

ఈ కాలం కుర్రాళ్ళకి

taste అంటూ ఒకటి ఏడ్చింది కదా!

ఏంటి అలా గుర్రుగా చూస్తున్నారు? ఈ మాటలు నేనన్నవి కాదు. TV9 ఏంకరమ్మో, ఏంకరమ్మకి రాసిపెట్టిన రైటరుదో!

విషయం ఏమిటి అంటే, అ మధ్యఎప్పుడో tv9 వాళ్ళు "youtube లో telugu spoofs" మీద కార్యక్రమం ప్రసారం చేసేరుట. అందులో మీవీడియో కూడా ఉంది చూడాండి అని ఒక స్నేహితుడు ఈ లంకె(వీడియో) పంపాడు. అంతా బానే ఉందికానీ, spoofs ని cover చేస్తూ, మధ్య మధ్యలో ఏంకరమ్మ వ్యాఖ్యానమే, బియ్యంలో రాళ్ళ లాగ, కలుక్కు, కలుక్కు మంటూ!

అందులో మచ్చుక్కి:
"ఈ కాలం కుర్రాళ్ళకి taste అంటూ ఒకటి ఏడ్చిందికదా".

ఓసి నీ దుంపతెగా!
ఏంకరమ్మా, ఏమి మా ఖర్మా,
అనుకోవడం మా వంతయ్యింది.

ps: మీరు కూడా నేనిచ్చిన లంకె కి వెల్లి (ఆ ఏంకరమ్మ అలాగే పలుకుతుంది మరి, "వెళ్ళి" అనలేదు కాబోలు, వీళ్ల తెగులు తగలెయ్య ) ఏంకరమ్మా, ఏమి మా ఖర్మా, అనుకోవడం మీ వంతవుతుందేమో చూడండి.

11, జనవరి 2009, ఆదివారం

బోటనీ పాఠముంది - పపాజాను పిజ్జ ఉంది

"బోటనీ పాఠముంది, మేటనీ ఆట ఉంది,
సోదరా ఏది బెస్టు రా!!!"
ఈ పాట మీ అందరినోటా బాగానే నాని ఉంటుందని నా అభిప్రాయం. మరి దానికి ఈ "పేరడీ" పాట చూడండి

అతడు:
papa john pizza ఉంది, burger-king burger ఉంది
సోదరా ఏది బెస్టు రా!
subway sub ఉంది, McD Mac ఉంది
దేనికో ఓటు చెప్పరా!
ఆమె:
pizzaలు, burgerలు తిన్నవాళ్ళు,
బస్తాల్లా, గిస్తాల్లా, బలిసి పోతరు

ఆవకాయ పప్పుకూడు తినిచూడు,
ముందరా, వెనాకాలా తేడచూడు!
జిగడ జిగడ... జిగడ,జిగడ జా....
అతడు:
car లో gas లేదు, race లో ace లేదు
మార్గమే చెప్పుగురువా!
అప్పులే పెరిగిపోయె, పప్పులే కరిగిపోయె
problem ఏ solve చెయ్యవా!
కొండలా course ఉంది, ఎంతకీ తరగనంది,
ఏందిరో ఈ గొడవా!
ఆమె:
ఎందుకూ హైరాణా చిట్టినాన్న
వెళ్ళరా సులువైన రూటులోనా!
వద్దురా Ph.D పట్టా గోల, చాలురా Masters ఇకనైనా!
జిగడ జిగడ... జిగడ,జిగడ జా....
అతడు:
Bostonలో బాల ఉంది, Houstonలో కేళి ఉంది
సోదరా ఏది best రా!
ఆమె:
Bostonలో బాలగోల మనకేలా,
Houstonలో కేళి అంటే ఒళ్ళు గుల్ల!
జిగడ జిగడ... జిగడ,జిగడ జా....
అతడు:
Bush లా బుస్సుమనే, Saddam లా తుస్సు మనే ఎవ్వడీ సీమరెడ్డి

అందరూ:
తందనా తందననా, తందనా తందననా,
తందనా తందననా....
అంటూ ముగుస్తుంది. ఆ వీడియోని క్రింద చూడండి


ఈ పాట కోసం రాసుకున్న, వాడని చరణాలు/పల్లవి:

  1. carl marx పాఠముంది, cinemark సినిమా ఉంద, దేనికో ఓటు చెప్పరా!
  2. wikipedia site ఉంది, youtube video ఉంది, ఇందులో ఏది best రా!
  3. Algebra class ఉంది AlJajeera TV ఉంది, ఇందులో ఏది best రా!
  4. subway sub అంటె డబ్బు, డబ్బు, McD Mac అంటే, దగ్గు, దగ్గు,
  5. starbucks coffee అంట, తగ్గు తగ్గు, జిగడ జిగడ ....
క్రెడిట్స్:
గాయని: మైత్రిరెడ్డి ముద్దసాని
కొరెయోగ్రఫీ: వీచిక ఇరగవరపు/సోమశేఖర్ ధవళ
కెమెరా: శిరీష్ కౌశిక్ లక్కరాజు/సోమశేఖర్ ధవళ
రచన/గానం/కూర్పు/దర్శకత్వం: సోమశేఖర్ ధవళ
సలహాదారు: అరుణ

పైపాట తియ్యడం కోసం మేముపడ్డ పాట్లు గురించి...

ఇందులో మీరు చూసినవారందరూ, college students యే! ఎవ్వరికీ ఇంతకుముందు నటించిన అనుభవంలేదు. అందులోనీ, తెలుగు సినిమా పాటలకి అవసరమయ్యే Dance Steps అసలు రావు. అంతమందినీ పెద్ద class room hall ముందు సమావేశపరిచి, కొంచం చేతులు, కాళ్ళు, నడ్దీ ముడ్డీ ఊపడం నేర్పేము. Song background లో play చేస్తూ, కాసేపు Drill practice చేయించాం. తరువాత left, right చేతులు చాపుతూ చప్పట్లు కొట్టడం, ఇవి మా వీడియోలో choregraph చెయ్యబడిన steps. ఈ తతంగం అంతా అయ్యేసరికి ఒక మూడు గంటలు పట్టింది. అన్నీటికన్నా ఎక్కువ, train పెట్టెలా నడుస్తూ చప్పట్లు కొట్టడం. అందరూ కుడివైపుకి కొడితే, ఒక్కడు మాత్రం ఎడమవైపుకి కొడతాడు. అంతమందినీ synchronize చేసేసరికి మూడు చెరువుల నీళ్ళు తాగాల్సొచ్చింది. కాకపోతే అంతమందీ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదట్లో కొంచం సిగ్గుపడినా గాని. ఇంక, వీడియో తీసే క్రమంలో జరిగే goof-ups ఎన్నో.

పాట గురించి కొన్ని సాంకేతిక విషయాలు:
ఇందులో పాడిన అమ్మాయి, చాలా బాగా పాడుతుంది. కానీ, male singers విషయానికొచ్చేసరికి మాకు ఎవరూ దొరకలేదు. దాంతో, track singer లా నేను పాడాను. తరువాత ఎవరైనా తెలుగు బాగా పాడేవాళ్ళు దొరికితే వాళ్ళాచే పాడిద్దామని. కాని, editing చాల time-taking process. అందుకే మళ్ళే అవన్నే చేసే ఓపికలేక, నేను పాడిన version ఏ ఉంచేసాం. అదే మీరు విన్నారు (పాపం, మీ ఖర్మ కాకపోతేనూ).

original song ని audacity లో edit చేసాము. మాకు కావాల్సిన basic beat patterns ని original song నుంచి extract చేసాం. తరువాత, ఆ beats తో loops create చేసాం. దాని మీద voice track ని overlay చేసాం. చివర్లో "తందనా తందనా ..." అని chorus లా ఉంది కదా. అది in fact ఒకరు పాడిందే. ఒక track తీసుకొని, కొంచం delay చేసి, అలాంటివి several versions add చేస్తే మీకు chorus effect వస్తుంది.

ఇది మేము Shiva born again అని ఒక సినిమాలాంటి వీడియో తీసిన ప్రయత్నంలోనిది. దానిపై మరెప్పుడైనా,
అంతవరకు శెలవు!

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును