కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, ఏప్రిల్ 2009, ఆదివారం

మల్లెల మాలలూగక మానునా, మాయునా?

మల్లీశ్వరి సినిమాలో "మనసున మల్లెల మాలలూగెనే" పాట ఏమాత్రం అభిరుచి ఉన్న శ్రోతలకైనా తెలుస్తుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కలం నుంచి జాలువారిన తెలుగు సొగసుల సిరి మల్లెల మాలలు ఆ సినిమాలోని మాటల పాటలు, పాటల ఆటలు.

వారి మేనకోడలు, అవసరాల (వింజమూరి) అనసూయాదేవి గారు ఎన్నో జానపద గీతాలని ఆంధ్రదేశమంతా తెరిగి, వెతికి పట్టి, బాణీలు కట్టి, స్వరబద్ధం చేసినవారుగా చిరపరిచితులు. వారి కృషిని మెచ్చి, ఆంధ్రవిశ్వవిద్యాలయం వారు "కళాప్రపూర్ణ" బిరుదుతో ఆవిడని సముచితంగా సత్కరించారు. వారిని 22 వ టెక్సాస్ తెలుగు సాహితీ సభల సందర్భంగా కలవడం జరిగింది. ఆవిడ మాట్లాడుతూ కొన్ని ఆశక్తికరమైన విషయాలని చెప్పారు. మల్లెశ్వరి లో, "నోమీ నోమన్నలాలొ" పాటకి, అలాగే "మనసున మల్లెల" పాటకి కూడా, బాణీలు ఆవిడే సమకూర్చేరుట (కానీ సినిమాలో రాజేశ్వరరావు గారీ పేరే కనబడుతుంది). అందుకే
కృష్ణశాస్త్రి విరచితమవ్వంగ
వింజమూరి రసస్వర వింజామరలు
విసురుగ విసరంగ, మనసున మల్లెల మాల
లూగక మానునా, మాయునా!
ఆవిడ కుటుంబానికి ఎంతోమంది పేరిన్నిక గల కవుల ( విశ్వనాధ, కొకు, శ్రీశ్రీ, చలం...) తో ఉన్న సన్నిహిత భాంధవ్యాల గురించి, ఆవిడ స్వంతమాటల్లొ ఇక్కడ వినండి (నిడివి 19 ని||)



(ఆ గొంతుక విన్నవారెవ్వరు, ఆవిడకి 89 సంవత్సరాలంటే నమ్మకపోవచ్చు)

7, డిసెంబర్ 2008, ఆదివారం

వెన్నెల

పొగడిన పెరుగు,
తెగడిన తరగు,
తరచి చూడ తెరమరుగౌ
ఆ నెలరేని వన్నెలే - వెన్నెల

ఆ చిన్నెలు వర్ణింప,
వర్ణములెల్ల తెల్లబోవా?

ఆ అర్ధచందురిని ఆర్ద్రము
అవగతమవ్వని తారలు, వెలవెలబోవా?

14, నవంబర్ 2008, శుక్రవారం

వర్షం

నేలని ముద్దెడదామని నింగి చేసిన ప్రయత్నం నీరుగారితే - వర్షం
(ఒక నిరాశావాది నిట్టూర్పు)

నింగిని చుంబిద్దామనే నేల ప్రయత్నానికి ముగ్ధులై, మేఘాలు ఆనందభాష్పాలు రాలిస్తే- వర్షం
(ఒక ఆశావాది ఊహ)

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును