30, జనవరి 2009, శుక్రవారం

పరిపూర్ణ పట్టభద్రుడు

లియోనార్డో డావిన్సీ బహుముఖప్రజ్ఞాశాలి. చిత్రకారుడి గా ఎక్కువమందికి తెలిసినా, గొప్ప ఇంజనీరని, మానవ అవయవ నిర్మాణాన్ని కూడా పరిశోధించాడని ఎక్కువమందికి తెలియకపోవచ్చు. అనేక మృతదేహాలని పరీక్క్షించి, తన చిత్రలేఖన చాతుర్యంతో వాటిని శాస్త్రీయంగా గ్రంధస్థం చేసాడు. Proportion of Man అని వ్యవహరింపబడే (ప్రక్క చూపించిన) చిత్రం అనేకమంది ని పరీక్షించిన తరువాత, సగటు (mean) అధారంగా ఒక పరిపూర్ణమానవుని శరీరసౌష్టవం ఎలా ఉండాలి అన్నదానికి సమాధనంగా గీసాడని ఒక వాదన. ఈ చిత్రం మేము తీసిన Proportion of Graduation అనే వీడియో కి ప్రేరణ.

ఇక్కడ graduate అంటే పట్టభద్రుడు. Proportion of Graduation కి దృశ్యరూపం ఇవ్వాలి అంటే, పరిపూర్ణ పట్టభద్రుని లో ఉండాల్సిన లక్షణలు ఏంటి? అది ఎలా సాధ్యం? అన్న ప్రశ్నలకి సమాధాన్ం వెతకాలి( ఇంకా వెతుకుతూనే ఉన్నాం). తెలుసుకొనే ప్రయత్నంలో, ఈ ఉపమానం చూడండి.

ఒక విగ్రహం/శిల్పం తయారు కావాలంటే, శిలతోపాటూ, ఉలి ఇత్యాది పరికరాలని ఉపయోగించి, కఠినమైన శిలకి జీవంపోసి అందమైన శిల్పంగా తయారుచెయ్యగల శిల్పాచార్యుడు కూడా ఉండలి. మరి వీరిద్దరి సంబంధం ఎటువంటిది?

శిల్పంకి ముడి పదార్దం శిలే కదా. అంటే, శిల్పాన్ని ఎవరూ గాల్లోంచో, మరేదో మాయచేసో తయారుచెయ్యలేరు. శిల్పంగా మార్పుచెందగలదు ఏ శిలాఅయినా. కానీ, ఒక అధ్భుత కళాఖండంగా మార్పుచెందాలి అంటే, మారాలనే ఆకాంక్ష శిలకి ఉండడంతోపాటూ, తగిన గురువు చేతిలో పాడాలి. ఉలి ఆటుపోటుల్ని తట్టుకోవాల ఓర్పు, సహనం కావాలి. మరి గురువు లక్షణాలు ఎలా ఉండాలి? తనవద్ద ఉన్న ముడిపదార్ధాన్ని ఎలా మలుచుకోవాలో తెలిసుండాలి. ఉలిని ఓడుపుగా పడుతూ, ఎప్పుడు, ఎక్కడ సుతిమెత్తగా చెక్కాలో, ఎప్పుడు ఎంతమోతాదులో, ఒక్కబాదు బాదాలో తెలుసిఉండాలి. తనఆధీనంలో ఉన్నంతకాలం శిల యొక్క సంపూర్ణభాద్యతవహించాలి.

చివరిగా ఒక masterpiece తయారుకావాలి అంటే ఒక master కావాలి, ఒక piece కూడా కావాలి. పై భావంతో Proportion of Graduaiton వీడియో ని క్రింద చూడండి.

ఇందులో రెండు tracks సమాంతరంగా నడిస్తూంటాయి. అప్పుడే ప్రవేశం లభించిన విద్యార్ధి ఒక పక్క, ఎమీలేని తెల్లకాగింతం ఒక పక్క. తెల్లకాగితం డావిన్సీ వంటి master చేతిలో పడితే, విద్యార్ధి ఒకా అత్యున్నతమైన విశ్వవిద్యాలయం (ఇక్కడ Texas A & M University) లో చేరతాడు. ఇద్దరూ కూడా అత్యంత క్లిష్టమైన పరిస్థితులని విజయవంతంగా ఎదుర్కొంటారు. కాగితం, అద్భుతమైన కళాఖండంగా రూపుదిద్దుకోటే, విద్యార్ధి పట్టభద్రుడై జీవితాన్ని ఎదుర్కోవడనికి సన్నద్ధుడౌతాడు.




Discover the masterpiece within
A & M: Finest craftsmen since 1876

అన్న tag-line తో ముగుస్తుంది.

వీడియో గురించి కొన్ని విశేషాలు:
  • ఇందులో నటించిన అబ్బాయి undergraduate, రష్యన్
  • అసలు footage అంతా shoot చేసేవరకు ఈ concept అనుకోలేదు. దాదాపు editing తోనే ఈ story చెప్పడం జరిగింది
  • నేపధ్యసంగీతం అందించిన వ్యక్తి myspace లో పరిచయం. ఫ్రాన్స్ దేశస్థుడు

20, జనవరి 2009, మంగళవారం

ఆంధ్రామృతం దత్తపూరణం

ఆచార్యులు చింతా రామకృష్ణారావు గారిచ్చిన దత్తపూరణం

"అక్క, చెల్లె, బావ, అన్న" అన్న పదాలతో "రామాయణానికి" సంభందించి ఒక పద్యం రాయాలి. నేను చేసిన ప్రయత్నం ఆటవెలది లో:

ఆ.వె:
"బావ" యనుచు వెంటపడిన రావణుచెల్లె
లముకుచెవులు కోసె లక్ష్మణుండు
అక్కసుతొవెడెలెను రక్కసి "అమ్మా! హు"
అని వగచుచు చేరెనన్న దరికి

ఇందులో, "బావ యనుచు వెంట పడిన" అన్న ప్రయోగం కొంచం వాడుకభాషకి దగ్గరలో ఉంది. దీని ఇంకాబాగా రాస్తే బావుణ్ణు. కానీ ఛందస్సుతో పని కాబట్టి నాకింకా అంత భావస్వేచ్ఛ రాలేదు. ప్రస్తుతం ఛందసు కోసమే ప్రయాస పడాల్సి వస్తొంది.

ఆచార్యులు కొన్ని తప్పులు సవరించారు. వాటిని comments లో చూడగలరు.

17, జనవరి 2009, శనివారం

దద్దోజనం మీద

ఆ.వె
గుమ్మపాల పెరుగు, కమ్మని తాళింపు
మేళవించినన్నమె గద, విందు
లందు జిహ్వనాడులచెలి దద్దోజనం
తన్నెఱగని జనము దద్దు జనమె!


భావం:
గుమ్మపాలుతోడుపెట్టిన గడ్డపెరుగు అన్నంకి,
ఎండుమిరప, శనగపప్పు ఇత్యాలుదలతో పోపు ( తాళింపు) పెడితే, రుచిని గ్రహించే నాడులకి ప్రియమైన దద్దోజనం సిద్ధం.

ఇంతవరకూ భోజనంలో దద్దోజనం తినని జనం, నిజంగా దద్దు (నిర్భాగ్య) జనం సుమీ! :)

గమనిక:
1)ఇది సరదాకి రాసినది, ఆటవెలదితో కూస్తీలో భాగంగా!
2)వ్యాకరణంలో దోషాలున్న తెలుపగలరు.

సమోసా : వహ్ క్యా బాత్ హై

ఇది బహుళ జనాభిప్రాయమే కదా! మరి ఆటవెలది లో సమోసాపై పద్యం చూడండి:

ఆ.వె
దట్టముగను, కట్టుదిట్టముగను పిండి
పొట్టనాలుగడ్డ, పోవునంత
ఉల్లిగడ్డ, బాగమఱిగినానూనెలొ,
వేగినా సమోస, వడిగతినుము! ||
ఎందుకు అంటారా, ఆలసించినఆశాభంగం
ఎందులకింకెందులకీ సమాలోచనలు
సాలు, సాలు, రసాలూరు సమోసాలు!
అంటూ సమోసాలు తింటూ బ్లాగులు చదువుకోండి :).
పై పద్యం మొన్న potluck dinner లో మా అందరికీ సమోసాలు చేసిపెట్టిన భానువాళ్ళ అమ్మగారికి అంకితం


ps: పెద్దలు వ్యాకరణ దోషాలు ఉంటే సూచించగలరు.

15, జనవరి 2009, గురువారం

ఆటవెలది లో మొదటిపద్యం

నేనింతవరకూ ఛందోబద్ధంగా ఎప్పుడూ రాయలేదు. నాకు ఎప్పటినుంచో ఈ కోరిక తీరని కోరికలాగే ఉండిపోయింది. ఆంధ్రామృతం వారు ఆశువుగా పద్యాలు చెప్పడం చూసి, స్ఫూర్తిపొంది ఈ ప్రయత్నం చేస్తున్నాను.

ఆటవెలది:
జఱభి నవ్వినంత, జాణతనంబంత
నెఱగి జాబిలి, విటునె మరపించె
ఉత్పలాక్షి గాంచి ఊసులుబోయెనా
వన్నె, విరిసి మెరిసి వెన్నెలగుచు

ఆటవెలది ఓ చిన్ననవ్వు విసరగానే, అందులోని జాణతనమంతా గ్రహించినా చందురుడు, రసికాగ్రేసరుడైన విటుడినే మరపించేడు. కలువల వంటి కన్నులుకల ఆ జవ్వనాంగిని చూడగానే, కలువలరేని వన్నెలు, చిన్నెలు, వెన్నలగ మారి విరిసేయి, మెరిసేయి.

పద్యం ఎన్నోరూపాంతరాలుచెంది ఆవిధంగా వచ్చింది. ఎన్నిమార్పులు, చేర్పులూ జరిగేయి, పద్యంరాయడంలో పడ్డపాట్లు గురించి తెలుసుకోవాలంటే ....


ఎలా అనేది క్రింద వివరించాను చూడండి.

ముందు రాసింది ఇది:
ఉత్పలాక్షిన్ గాంచిన, శశి ఉష సొగసుల
వన్నె, వెన్నెలందు విరిసె, మెరిసె
జఱభి నవ్విన, జాబిలి చెక్కిలి, చికి
లించిన చెలియ కలల కనుబొమ్మ

భావం:
కలువల వంటి కన్నులు గల చిన్నాదాన్ని చూసిన కలువలరేని (చంద్రుని) కాంతుల సొగసులు వెన్నెలలో విరిసి, మెరిసేయిట. ఆ సుందరాంగి నవ్వితే, చంద్రుడి బుగ్గలు, ఆమె అందమైన కనుబొమ్మల్లా బాణంవంగినట్టు సొట్టబోయాయిట.

ఆటవెలది లక్షణాలు:
1) ఒకటి, మూడు పాదాల్లో రెండు ఇంద్రగణాలు, మూడు సూర్య గణాలు ఉండాలి
2) రెండు, నాలుగు పాదాల్లో అయిదు సూర్య గణాలు ఉండాలి
3) ప్రతీ పాదంలో మొదటి అక్షరం, నాల్గవ గణంలో మొదటి అక్షరం తో "యతిమైత్రి" ఉండాలి.

వీటిని ఆధారంగా రాసిని పద్యాన్ని చూద్దాం:

మొదటి పాదం గణ విభజన:
(btw, U అంటే గురువు, I అంటే లఘువు)
  1. ఉత్పలాక్షిన్(UIUU) గాంచిన(UII), శశి(II) ఉష(II) సొగసుల(IIII)
  2. కలిపిరాస్తే UIUUUIIIIIIIIII
  3. గణాలుగా విభజిస్తే UIU, UUI, III, III, III
  4. అవివరుసగా ర, త, న, న, న
  5. ర, త లు ఇంద్రగణాలు, న సూర్య గణం
  6. ఊ, ఉ లు యతిమైత్రి కలిగిఉన్నాయ
రెండవ పాదం గణ విభజన:
  1. వన్నె(UI), వెన్నె(UI) లందు(UI) విరిసి(III), మెరిసె(III)
  2. కలిపిరాస్తే UIUIUIIIIIII
  3. గణాలుగా విభజిస్తే UI, UI, UI, III, III
  4. అవిఅన్నీ గలము, గలము, , గలము న, న (, గలము అంటే "గురువు+లఘువు"అని)
  5. "గలము", "న" ఇవి మాత్రమే సూర్య గణాలు
  6. వ, వి లు యతిమైత్రి కలిగిఉన్నాయ
మూడా పాదం గణ విభజన:
  1. జఱభి(III) నవ్విన(UII), జాబిలి(UII) చెక్కిలి(UII), చికి(II)
  2. కలిపిరాస్తే IIIUIIUIIUIIII
  3. గణాలుగా విభజిస్తే III, UII, UII, UI, III
  4. అవిఅన్నీ న,భ, భ, గలము, న, గణాలు
  5. "గలము", "న" ఇవి మాత్రమే సూర్య గణాలు, మిగతావి ఇంద్రగణాలు
  6. జ, చె లు యతిమైత్రి కలిగిఉన్నాయ
నాల్గవ పాదం గణ విభజన:
  1. లించిన(UII) చెలియ(III) కలల(III) కనుబొమ్మ(IIUI)
  2. కలిపిరాస్తే UIIIIIIIIIIUI
  3. గణాలుగా విభజిస్తే UI, III, III, III, UI
  4. అవిఅన్నీ "గలము", న, న, న, "గలము", గణాలు
  5. "గలము", "న" ఇవి మాత్రమే సూర్య గణాలు
  6. లి, ల యతిమైత్రి కలిగిఉన్నాయ
కాని:
పెద్దలు చింతా రామకృష్ణారావు గారు, నరహరి గారు, రాఘవ గారు, , చదువరి గారు కొన్ని తప్పులు పట్టేరు వారికి నా కృతజ్ఞతలు.

అవి:
1) ఆ.వె లో మొదటి, మూడు పాదాల్లో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు వరసగా రావాలి. నేను మొదటి రాసినదాంట్లో, ordering లేదు.
2) ఆ.వె లో యతిప్రాస కుదురుతుంది. ఇంతకుముందు ఈ విషయంనాకు తెలియదు.
పై రెండు సూచనలనీ పరిగణన లోకి తీసుకొని, ముందు రాసిన పద్యాన్ని ఈ విధంగా మారిస్తే,

జఱభి నవ్వినంత, జాణతనంబంత
నెఱగి జాబిలి, విటుని మరపించె
ఉత్పలాక్షిని గనినంత, పున్నమిరేని
వన్నె, విరిసె మెరిసె వెన్నెలగుచు

వచ్చింది. మీరు గమనిస్తే, మొదటి రెండు పాదాల్లోనూ, యతి, చివరి రెండు పాదాల్లో ప్రాసయతి కి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. కానీ, ఇందులో కూడ తప్పులు ఉన్నాయి. ఆచార్యులు చింతా రామకృష్ణారావు ఎంతో వ్యయప్రయాసలకోర్చి, సవివివరంగా comments ద్వారా తెలియజెప్పేరు. వారు సూచించినవిధంగా రెండో పాదంలోను, మూడోపాదంలోనూ యతిని సరిచేస్తే వచ్చినది:

జఱభి నవ్వినంత, జాణతనంబంత
నెఱగి జాబిలి, విటునె మరపించె
ఉత్పలాక్షి గాంచి ఊసులుబోయనా
వన్నె, విరిసి మెరిసి వెన్నెలగుచు


నేను పైనవ్యక్తపరచినవి ఒక చిన్న పుస్తకం చూసి నేరుచుకుని, extrapolate చేసినవి. నాకు వీటిమీద పెద్దగా జ్ఞానంలేదు. పదోతరగతి వరకు కొంచం తెలుగు వ్యాకరణం చదువుకొన్నాను. ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్ధూలం ఇవి మాత్రమే చదివినట్టుగుర్తు. అవిమరచిపోయి దశాబ్దంపైగాకావస్తోంది. అందుకే, ఒక వ్యాకరణ పుస్తకం ముందు పెట్టుకొని, కొంచం practice చేసాను. తెలిసిన పద్యానికి, గణవిభజన వగైరాలని. పద్యం ఇస్తే, అది కోవలోకి వస్తుందోచెప్పడం వరకూ పర్వాలేదు, కానీ, సూత్రాలని అనుసరిస్తూ రాయడం మాటలు కాదు అని తెలిసుకున్నాను. అప్పుడు, మన కవులమీదా అమాంతం గౌరవభావం, ఆరాధ్యనాభావాం ఉన్నదానికి ఒక వెయ్యిరెట్లు పెరిగాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తిలేదు.

నేను పైన రాసిన నాలుగు పదాలు చాలా వరకు trial & error తరువాత వచ్చినవి. ఎలాఅంటే:

స్థూలంగా ముందు ఒక భావంకొని, rough draft తయారుచేసి, లఘువులుగా, గురువులుగా, విభజించి, గణాలు గుర్తించాలి. తరువాత అవి ప్రాధమిక సూత్రాలకి అణుగుణంగా ఉన్నాయోలేదో చూసుకోవాలి. అలా లేకపోతే నానార్ధాలో, పర్యాయపదాలో వాడడం, లేదూ అంటే వ్యాక్యాన్ని direct/indirect speech, active/passive voice లాగ మార్చడం, ఇంకా కుదరకపోతే, కొంచం భావమార్చడం చెయ్యాలి. నామటుకు, ఇదొక maths puzzle లా అనిపించింది. ఆటవెలది లో, ఉండాల్సినవి సూర్యగణలు (మొత్తం 2), ఇంద్రగణాలు(మొత్తం 16). గణవిభజన (parsing) ఎలాగైనా చెయ్యొచ్చు (మొత్తం 5 గణాలు ఉండేలా చూసుకోవాలి). కాబట్టి చాలా freedom ఉంది. ముందు ఒక రెండు పదాలు, చివర పదం అనుక్కొని, మధ్యలో ఏఏ పదాలు పడతాయో permutations ద్వారా ప్రయత్నించొచ్చు. ఇవి నేను try చేసిన methods. కావునా, handle with care :)


ps: వ్యాకరణం, ఛందస్సు తెలిసినవారు ఇందులో ఏవైనా తప్పులుంటే సరిదిద్దగలరు.

13, జనవరి 2009, మంగళవారం

ఈ కాలం కుర్రాళ్ళకి

taste అంటూ ఒకటి ఏడ్చింది కదా!

ఏంటి అలా గుర్రుగా చూస్తున్నారు? ఈ మాటలు నేనన్నవి కాదు. TV9 ఏంకరమ్మో, ఏంకరమ్మకి రాసిపెట్టిన రైటరుదో!

విషయం ఏమిటి అంటే, అ మధ్యఎప్పుడో tv9 వాళ్ళు "youtube లో telugu spoofs" మీద కార్యక్రమం ప్రసారం చేసేరుట. అందులో మీవీడియో కూడా ఉంది చూడాండి అని ఒక స్నేహితుడు ఈ లంకె(వీడియో) పంపాడు. అంతా బానే ఉందికానీ, spoofs ని cover చేస్తూ, మధ్య మధ్యలో ఏంకరమ్మ వ్యాఖ్యానమే, బియ్యంలో రాళ్ళ లాగ, కలుక్కు, కలుక్కు మంటూ!

అందులో మచ్చుక్కి:
"ఈ కాలం కుర్రాళ్ళకి taste అంటూ ఒకటి ఏడ్చిందికదా".

ఓసి నీ దుంపతెగా!
ఏంకరమ్మా, ఏమి మా ఖర్మా,
అనుకోవడం మా వంతయ్యింది.

ps: మీరు కూడా నేనిచ్చిన లంకె కి వెల్లి (ఆ ఏంకరమ్మ అలాగే పలుకుతుంది మరి, "వెళ్ళి" అనలేదు కాబోలు, వీళ్ల తెగులు తగలెయ్య ) ఏంకరమ్మా, ఏమి మా ఖర్మా, అనుకోవడం మీ వంతవుతుందేమో చూడండి.

11, జనవరి 2009, ఆదివారం

బోటనీ పాఠముంది - పపాజాను పిజ్జ ఉంది

"బోటనీ పాఠముంది, మేటనీ ఆట ఉంది,
సోదరా ఏది బెస్టు రా!!!"
ఈ పాట మీ అందరినోటా బాగానే నాని ఉంటుందని నా అభిప్రాయం. మరి దానికి ఈ "పేరడీ" పాట చూడండి

అతడు:
papa john pizza ఉంది, burger-king burger ఉంది
సోదరా ఏది బెస్టు రా!
subway sub ఉంది, McD Mac ఉంది
దేనికో ఓటు చెప్పరా!
ఆమె:
pizzaలు, burgerలు తిన్నవాళ్ళు,
బస్తాల్లా, గిస్తాల్లా, బలిసి పోతరు

ఆవకాయ పప్పుకూడు తినిచూడు,
ముందరా, వెనాకాలా తేడచూడు!
జిగడ జిగడ... జిగడ,జిగడ జా....
అతడు:
car లో gas లేదు, race లో ace లేదు
మార్గమే చెప్పుగురువా!
అప్పులే పెరిగిపోయె, పప్పులే కరిగిపోయె
problem ఏ solve చెయ్యవా!
కొండలా course ఉంది, ఎంతకీ తరగనంది,
ఏందిరో ఈ గొడవా!
ఆమె:
ఎందుకూ హైరాణా చిట్టినాన్న
వెళ్ళరా సులువైన రూటులోనా!
వద్దురా Ph.D పట్టా గోల, చాలురా Masters ఇకనైనా!
జిగడ జిగడ... జిగడ,జిగడ జా....
అతడు:
Bostonలో బాల ఉంది, Houstonలో కేళి ఉంది
సోదరా ఏది best రా!
ఆమె:
Bostonలో బాలగోల మనకేలా,
Houstonలో కేళి అంటే ఒళ్ళు గుల్ల!
జిగడ జిగడ... జిగడ,జిగడ జా....
అతడు:
Bush లా బుస్సుమనే, Saddam లా తుస్సు మనే ఎవ్వడీ సీమరెడ్డి

అందరూ:
తందనా తందననా, తందనా తందననా,
తందనా తందననా....
అంటూ ముగుస్తుంది. ఆ వీడియోని క్రింద చూడండి


ఈ పాట కోసం రాసుకున్న, వాడని చరణాలు/పల్లవి:

  1. carl marx పాఠముంది, cinemark సినిమా ఉంద, దేనికో ఓటు చెప్పరా!
  2. wikipedia site ఉంది, youtube video ఉంది, ఇందులో ఏది best రా!
  3. Algebra class ఉంది AlJajeera TV ఉంది, ఇందులో ఏది best రా!
  4. subway sub అంటె డబ్బు, డబ్బు, McD Mac అంటే, దగ్గు, దగ్గు,
  5. starbucks coffee అంట, తగ్గు తగ్గు, జిగడ జిగడ ....
క్రెడిట్స్:
గాయని: మైత్రిరెడ్డి ముద్దసాని
కొరెయోగ్రఫీ: వీచిక ఇరగవరపు/సోమశేఖర్ ధవళ
కెమెరా: శిరీష్ కౌశిక్ లక్కరాజు/సోమశేఖర్ ధవళ
రచన/గానం/కూర్పు/దర్శకత్వం: సోమశేఖర్ ధవళ
సలహాదారు: అరుణ

పైపాట తియ్యడం కోసం మేముపడ్డ పాట్లు గురించి...

ఇందులో మీరు చూసినవారందరూ, college students యే! ఎవ్వరికీ ఇంతకుముందు నటించిన అనుభవంలేదు. అందులోనీ, తెలుగు సినిమా పాటలకి అవసరమయ్యే Dance Steps అసలు రావు. అంతమందినీ పెద్ద class room hall ముందు సమావేశపరిచి, కొంచం చేతులు, కాళ్ళు, నడ్దీ ముడ్డీ ఊపడం నేర్పేము. Song background లో play చేస్తూ, కాసేపు Drill practice చేయించాం. తరువాత left, right చేతులు చాపుతూ చప్పట్లు కొట్టడం, ఇవి మా వీడియోలో choregraph చెయ్యబడిన steps. ఈ తతంగం అంతా అయ్యేసరికి ఒక మూడు గంటలు పట్టింది. అన్నీటికన్నా ఎక్కువ, train పెట్టెలా నడుస్తూ చప్పట్లు కొట్టడం. అందరూ కుడివైపుకి కొడితే, ఒక్కడు మాత్రం ఎడమవైపుకి కొడతాడు. అంతమందినీ synchronize చేసేసరికి మూడు చెరువుల నీళ్ళు తాగాల్సొచ్చింది. కాకపోతే అంతమందీ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదట్లో కొంచం సిగ్గుపడినా గాని. ఇంక, వీడియో తీసే క్రమంలో జరిగే goof-ups ఎన్నో.

పాట గురించి కొన్ని సాంకేతిక విషయాలు:
ఇందులో పాడిన అమ్మాయి, చాలా బాగా పాడుతుంది. కానీ, male singers విషయానికొచ్చేసరికి మాకు ఎవరూ దొరకలేదు. దాంతో, track singer లా నేను పాడాను. తరువాత ఎవరైనా తెలుగు బాగా పాడేవాళ్ళు దొరికితే వాళ్ళాచే పాడిద్దామని. కాని, editing చాల time-taking process. అందుకే మళ్ళే అవన్నే చేసే ఓపికలేక, నేను పాడిన version ఏ ఉంచేసాం. అదే మీరు విన్నారు (పాపం, మీ ఖర్మ కాకపోతేనూ).

original song ని audacity లో edit చేసాము. మాకు కావాల్సిన basic beat patterns ని original song నుంచి extract చేసాం. తరువాత, ఆ beats తో loops create చేసాం. దాని మీద voice track ని overlay చేసాం. చివర్లో "తందనా తందనా ..." అని chorus లా ఉంది కదా. అది in fact ఒకరు పాడిందే. ఒక track తీసుకొని, కొంచం delay చేసి, అలాంటివి several versions add చేస్తే మీకు chorus effect వస్తుంది.

ఇది మేము Shiva born again అని ఒక సినిమాలాంటి వీడియో తీసిన ప్రయత్నంలోనిది. దానిపై మరెప్పుడైనా,
అంతవరకు శెలవు!

2, జనవరి 2009, శుక్రవారం

పిల్లమారుతం

వరాళి వీచిక. ఈ పేరు చాలా బావుంది కదూ. ఈ పేరు తో బ్లాగు రాస్తున్న శ్రావ్యవరాళి అనే ఎనిమిదో( లేక తొమ్మిదో) తరగతి చదువుతున్న చిన్నారి ఆలోచనలు అంతకంటే బావుంటాయి. గతసంవత్సరం లోసంభవించిన "ముంబయి ఘాతుకం" నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చోవివరిస్తున్న వరాళి వీచికను ఇక్కడ చూడండి

ఆశావాదులు పరాజయాన్ని కూడా విజయానికి సోపానంగా ఎలామలచుకోవచ్చో చెప్పినట్లు లేదూ?

ఈ పిల్లమారుతానికి ఈ సందర్భ్ంగా నా అభినందనలు!

లోక్ సత్తాకు నిజమైన గుర్తింపు

మంత్రి షబ్బీర్ అలీ నేర చరిత్రని ఉటంకిస్తూ ప్ర.రా.ప నేత ఖలీల్ బాషా
"ఈయన లోక్ సత్తా చరిత్రహీనుల జాబితా లో ఉన్నాడు"

అని అన్నట్టుగా వచ్చిన వార్త విని నాకనిపించింది లోక్ సత్తాకి ఇది నిజమైన గుర్తింపని. రాజకీయ ప్రత్యర్ధి నమ్మకం చూరాగొనడం ఈ రోజుల్లో సాధ్యపడేపనేనా ఇది. దాన్ని సుసాధ్యంచేసిన లోక్ సత్తా కి నా శుభాభినందనలు.


1, జనవరి 2009, గురువారం

ప్రతిభా ( పాటవాలు లేని ) పాటిల్

ప్రతిభా పాటిల్.
కాదు, ప్రతిభలేని పాటిల్.
అంతేకాదు ప్రతిభతో పాటూ పాటవం కూడా లేని పాటిల్.

కొంగుకప్పుకొని ఆవిడ ఉండే ఏ ఛాయాచిత్రాన్ని చూసినా నాకు కలిగే భావన ఇదే! మనం ఒక పది తరాలు వెనక్కి వెళ్ళిపొయినట్టుగా ఉంటుంది. ఈవిడేనా మన త్రివిధదళాధిపతి అనిపిస్తుంది. ప్రతీ గణతంత్రదినంనాడూ ఇచ్చే ఉపన్యాసాలు విని/చదివి స్ఫూర్తిపొందిన వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా అని నా అనుమానం. మనరాజ్యాంగంలో, రాష్ట్రపతి పదవి రబ్బర్ స్టాంప్ అయితే, ఈవిడ ఆ మూసలో అచ్చుగుద్దినట్టుగా సరిపోతారు. సినీపరిభాషలో చెప్పాలంటే ఆ పాత్రకి "పూర్తి" న్యాయంచేస్తారు.

మన్మోహన్ సింహ్ గారు కూడా అలాగే తోస్తారు. అయన జ్ఞానే కావచ్చు, కానీ వెన్నెముకలేని నాయకునిలా కనిపిస్తారు. మానవమృగాలు స్వేచ్ఛగా సంచరించే "zoo" లో బంధించ బడ్డ ఈ సింహం జూలు విదిలిస్తే, ఆ జూలు రాలిపోతుందని జాలి కలుగుతుందే తప్ప, మనతోలుతీసి డోలువాయించగలదని ఎవరికైనా అనిపిస్తుందా?

"తీవ్రవాదుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం" అని వీరిద్దరిలో ఎవరైనా ఘర్జిస్తున్నప్పుడు,
గుండె వేగంగా కొట్టుకుంటూ,
రోమాలు నిక్కబొడుచుకుంటూ,
కనుబొమ్మలు దగ్గరైతూ,
మెదడులో "నేనుకూడా అందులో ఒక సైనికుణ్ణి కావాలి "
లాంటి ఆలోచనలు మొదలుతయా? లేక

పెదవులమీద ఒక నిరాశక్తి, నిర్లిప్తలతో కూడైన నవ్వు,
నేను ఏడ్వలేక నవ్వుతున్నాను అంటుందా?


గమనిక: ఇది పూర్తిగా నిరాధారపూరితమైన భావన. ఎవర్ని చూసినా ఒక అభిప్రాయ్ం (తప్పో, ఒప్పో) ఏర్పరుచుకుంటాం. ఇది కూడా అలాంటిదే!

నూతనవత్సర శుభాకాంక్షలు

మిత్రులకు, హితులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు, అందరికి:
ఈ సంవత్సరాది,
మీ అయ్యురారోగ్యాలకు, సుఖసంతోషాలకు, సకల ఐశ్వర్యాలకు
మరోపునాది కావలని ఆకాంక్షిస్తూ,

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును