15, ఏప్రిల్ 2009, బుధవారం

యథా ప్రజా - తథా రాజా

గత కొన్ని నెలలుగా బ్లాగ్లోకంలో ఫొటోలుపెట్టి మరీ విమర్శలు చేస్తూ, మా జాతిని మొత్తం అవమానపరుసున్నందుకు మనస్తాపం చెంది నేను రాస్తున్న బహిరంగ లేఖ.


(శబ్దరూపంలో)

మాపై వచ్చిన ప్రధాన ఆరోపణలు: నీతి, నిజాయితి, సమదృష్టి, నైతికవిలువలు, పారదర్శకతవంటివి లేకపోవడం. డబ్బు-పరపతి లకోసం ప్రాకులాడ్డం, సహనం కోల్పోయి నోటికొచ్చినట్టు మాట్లాడ్డం. ఇవి ఒక రాజకీయనాయకునికి ఉండాల్సిని కనీస అర్హతలు అని . ఇవన్నీ మాలో మాత్రమే ఉన్నాయా, వీటిలో మీరుపట్టభద్రులుకారా అని నేను మిమ్మల్ని ప్రశ్నించదలచుకొన్నాను. ఇది ఎన్నికల సమయం కాబట్టి మమ్మల్ని ఆడిపోసుకోవడం మరీ ఎక్కువయ్యింది. డబ్బు విచ్చలవిడిగా ప్రవహిస్తుంతోందని. మద్యం ఏరులై పారుతోందని.

ఏమయ్యా, బాబూ, కొంచం సాయం చెయ్యవయ్యా అంటే, "నా కేంటి" అనే మనస్తత్వం నీది. నీవాటా ఇవ్వకుండా రమ్మంటే, మరి నీ పనులన్నీ మానుకొని నువ్వొస్తావా? అయినా మేం చేసే ఖర్చువల్ల ఒనగూరే సామాజిక న్యాయం మీకర్ధమవ్వట్లేదు. అధికారంలో ఉన్నప్పుడు సంపాదిస్తాం. ఎన్నికలప్పుడు ఖర్చుపెడతాం. అవసరమైతే ఖర్చుపెట్టిస్తాం కూడా. మేము దోచిన సొమ్ముని మళ్ళీ మీ దోసిళ్ళాలోనే కదా పోస్తున్నాం. ఇంతకు మించిన ఎకనమిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఈ ప్రపంచంలోనే లేదు.

మీ సాఫ్టువేరు/హార్డువేరు కంపెనీల్లో, వేరేవాడు ఒక పదివేలు ఎక్కువిస్తానంటే చెప్పాపెట్టకుండా ఉద్యాగాలు దూకెస్తారే? మరి పార్టీలు దూకితే మమ్మల్నెందుకంటారు. మాకు మారడానికి మహా అయితే మూడుపార్టీలున్నాయి. మీలాగ పదుల/వందల సంఖ్యలో లేవు. అందునా దూకడం మా జన్మహక్కు. మాక్కూడా పైకెదగడానికి మీతోపాటూ సమనావకాశాలు కావాలి, రావాలి. ఇందుకు మేం చట్టాలు చేసుకొంటాం. ప్రజల కోసం - ప్రజల కొఱకు అన్న నానుడిని మా అంతబాగా నిజంచేస్తున్నవారెవరో మీరు చెప్పండి.

మీరు దేశంకోసం ఏమైనా చేసారా? మీరెవరికైనా ఉద్యాగాలిప్పించారా? అదీ ఏ అర్హతలేని వాడికి. మా వల్ల ఎందుకూ కొరగాని వెధవాయలెందరికో ఉపాధికల్పిస్తున్నాం. కావాల్సిన అర్హత ఒకేఒక్కటి. అది నమ్మకం, అంతే. వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని పెద్దన్నలా పోషిస్తున్నాం. మేమే లేకపోతే, నిరుద్యోగ సమస్య పెనుభూతమై మీ ఉద్యోగాలనీ కబళిస్తుంది. మీకు చేతకాని పనులెన్నో మేము చేస్తున్నాం. చేసి చూపిస్తున్నాం. అయినా మా మీద ఏంటో మీ ఏడుపు.

తిరుపతి లో భగవంతుని దర్శనానికి క్యూలో నిలోచోడానికి కూడా మీకు బద్దకం. VIP దర్శనం దొరికిందని నలుగురిలో గొప్పగా చెప్పుకోవాలని ఆరాటం. అందుకు మా MLAల, MPల, లెటర్లు కావాలి. అప్పుడు గుర్తొచ్చామా మేము? పదిమందిలో మా వాడు మంత్రి, మాచుట్టం కంత్రి అని చెప్పుకోవడానికి కావాలి. మీకు కాంట్రాక్టులు పనులు కావాలంటే మేము చక్రం తిప్పాలి. అప్పుడు మాత్రమే గుర్తొస్తామా మేము? ఇంతా చేసీ, చేడీ, పబ్లిగ్గా తిట్టడానికి ఎవరు అప్పనంగా దొరుకుతార్రా అంటే, మేమే. ఇంకెవరు. ఇంకెవిరినైనా అంటే పడతారా వాళ్ళు. మీ బొమికలేరరు.


కులాలు మతాల గొడవలు: ఎందుకలా కొట్టుకు చస్తారు. మాదంతా ఒకే కులం: రాజకీయం. మాది ఒకే మతం: స్వలాభం. మాకు లేని కులాలు, మతాల గొడవలు మీకెందుకు. ఈ పార్టీ, ఆ పార్టీ అనే బేధభావనలు మాకులేవు. అంటరానితనం అసలే లేదు. మేమంతా ఎంతో ఐకమత్యంగా ఉంటాం. కొట్టుకున్నట్టు మీ కళ్ళకి కనిపిస్తాం. ఎందుకంటే, మీరు గ్రుడ్డివాళ్ళు కాబట్టి.

మీరు ఉద్యాగోలు కోసం ఎగబడుతూ, లేని విద్యార్హతలు సృష్టించుకోలేదా? లేని అనుభవాన్ని ఉన్నది గా చెప్పుకొని ఉద్యాగాలు సంపాదించలేదా? CVలు, రెస్యూమెలు కూడా కాపీ కొట్టలేదా? మేమూ అలాగే చెప్తాం, చేస్తాం. సంఘసేవ చేసామని, చేస్తామని. ప్రజల కష్టాలు తెర్చడమే మా పరమావధి అని. మీరే అబద్ధాల పుట్టలైనప్పుడు, మీకెందుకు నిజాలు చెప్పాలి? మీరుచేస్తే ఒప్పు. మేము చేస్తే తప్పునా? ఇదక్కిడి న్యాయం? ఎందుకీ ద్వందప్రవృత్తి?

పెళ్ళో, చావో వచ్చినప్పుడు కరెంటు స్తంభానికి తీగలు తగిలించి విద్యుత్తు చౌర్యం చెయ్యడం లేదా? పొలాల్లొ, అక్రమంగా మీటర్లు టాంపరింగి చెయ్యట్లేదా? సాగుకాలువలని దారి మళ్ళించి, మీ కమతానికి నీరందితే చాలు, కిందవాడేమైపోయినా పర్వాలేదు అనుకోవట్లేదా? బందులు, హర్తాళ్ళు అంటూ, బస్సులు, ఆసుపత్రులు, కార్యాలయాలు తగలపెట్టి ప్రభుత్వఖజానా కొల్లగొట్టట్లేదా? ఇంత బహిరంగా దోపిడీ చేసే మీరు మా ఆదాయవవరులని ప్రశ్నించే హక్కు ఎప్పుడో కోల్పోయారు!

మేనిఫెస్టోలో చెప్తాం. ఎన్నో చెప్తాం. అది చేస్తాం ఇది చేస్తాం అని. అంటే అన్నె చేసెయ్యాలా? చెయ్యగలమా? చెయ్యనిస్తారా? మీరు పైదేశాలకి చదువలకని చెప్పి, "నేను చిన్నప్పట్నుంచి ఐనిస్టీను లాగ ఆలోచించే వాడిని. నా వల్ల మీ యూనివర్శికే కళ పెరుగుతుంది" లాంటి కల్లబొల్లి కబుర్లు చెప్పరా? ప్రగల్భాలు పోరా? వాగ్ధానభంగంచేసినందుకు మీ డిగ్రీలన్నీ బర్ముడ ట్రయాంగిల్ లో విసిరిపారెయ్యాలి అసలు. అదిసరే, పోనీ మనదేశంలో డిగ్ర్రీలు అంటే, మార్కెటులో పట్టాలు కొనుక్కోవట్లేదా? ర్యాంకులు కొనుక్కోవట్లేదా? చదువులు కొనుక్కోవట్లేదా? మీ దురాశకి అంతనేది ఉందా. ఇలా వేలమంది దోచుకుంటున్న ధనరాశి ముందు, మా సంపాదన ఎంత. మీరు వేసే ముష్టి తో సమానం. పక్కవాడ్ని నొక్కి, తొక్కిపైకెళ్ళడం. ఇది అందరి ప్రాధమిక హక్కు. కాదనే అధికారం మీకు లేదు.


మా ఆస్తుల చిట్టా విప్పి, అయ్యో నీకు కారు కూడా లేదని వాపోతారు, పాపం జాలి చూపిస్తారు, కాదు కాదు మా బీదరికపుపాట్లని చూసి గేలీ చేస్తారు. ఎగతాళి చేస్తారు. మరి మీ సంగతేంటి? ఇన్-కం టాక్సు ఎగ్గొడ్డానికి నానా అవస్థలూ పడతారు. నానా సంకలూ నాకుతారు. కానీ కుళాయి కావాలి. కరెంటు కావాలి. గిరెంటు కావాలి. ప్రభుత్వం నుంచి సకల సౌకర్యాలు కావాలి. మనం మాత్రం జేబులోంచి పైసా తియ్యం. ఇన్-కం టాక్సు వాడికి పది రూపాయలని చూపించిన ఆదాయం, అదే వీసా అప్లై చెయ్యాడానికి వెయ్యురూపాయలయ్యి కూర్చుంటుంది. మా ఆస్తి కూడా అంతే గురువుగారు. సందర్భం బట్టి దాని విలువ పెరుగుతుంది లేదా తరుగుతుంది. తగ్గకపోతే తగ్గిస్తాం. ఏం మీరుచెయ్యగా లేనిది, మేము చెయ్యకూడదా?

ఇంక ఏదో మా భాష గురించి, మా నైతికవిలువలు గురించి, మా సభ్యత-సంస్కారాల గురించి. పాపం మీరు పెదవులు విరిచి విరిచి, అవి రెండు చెక్కలు, మీ మండే గుండె మూడు ముక్కలు అయ్యాయి కాబోలు. మీరు చదువుకున్నా వారు ట. సంస్కారవంతులు ట. మరి మీ భాష అలా అఘోరించిందేం. ఎందుకలా ప్రాముఖ్యతకోసం పాకులాడతారు. ఎందుకలా వీధి కుక్కల్లా కొట్టుకుంటారు. ఎందుకలా కాకుల్లా చెవులు చిల్లులు పడేలా తిట్టుకుంటారు. ఎవరు ఎవరికీ తెలియనప్పట్టికి "అటుతంతాం, ఇటు తంతాం" అంటూ అపర ఘటోత్కచుడిలా చిందులు తొక్కుతారు. వందమందికూడా లేని మీలోనే నమ్మకంలేదు. మర్యాద లేదు. మన్ననలేదు. పెద్దరికంలేదు. కట్టుబడిలేదు. మరి వేలమంది మూర్ఖులు, అదే అభిమానులున్న మాకెలా సాధ్యం అనుకుంటున్నారు.

మేమెక్కడినుంచో ఊడిపడలేదు మహాప్రభో. మేము గ్రహాంతరవాసులం అంతకన్నా కాదు. మేంకూడా మీలో ఒకరమే. విమర్శలు చేసేముందు ఆ విషయం మరచిపోకండి.

మార్పురావాలి అంటే, అది మీలోంచే మొదలవ్వాలి. మా నుంచికాదు.
యథా ప్రజా - తథా రాజా

ఇట్లు
- ఒక రాజకీయ నాయకుడు

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

వహ్వా, భలే రాశారు. నూటికి నూరుపాళ్లూ నిజం. వాళ్లేదో క్లాస్ ఎపార్ట్ అన్నట్టు చూస్తాం. అందరం ఆ తాను ముక్కలమే అన్నది మరిచిపోయి.

అసంఖ్య చెప్పారు...

ఏమోనండి అరుణగారు. ఇప్పుడా రాజకీయనాయకుడి మీద NASA లాంటి చట్టాలేమైనా ప్రయోగిస్తారేమో చూడాలి :)

అజ్ఞాత చెప్పారు...

well said..

every voter should read..

నాగప్రసాద్ చెప్పారు...

బాగా చెప్పారు. :):)

krishna rao jallipalli చెప్పారు...

వామ్మో రివర్స్ లో బలే వాయించేసారే.. నిజమే మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం. ప్రజానాయకుడు లో నాగ భూషణం గుర్తుకొచ్చాడు.

Anil Dasari చెప్పారు...

>> "మార్పురావాలి అంటే, అది మీలోంచే మొదలవ్వాలి. మా నుంచికాదు"

నిఝంగా నిజం. బాగా చెప్పారు. ఇదే విషయమ్మీద ఇట్లుండి నరుక్కొద్దాం అంటూ అప్పుడెప్పుడో నేనూ ఓ టపా విసిరా.

Ghanta Siva Rajesh చెప్పారు...

నూటికి నూరుపాళ్లూ నిజం
బాగా చెప్పారు

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును