31, జులై 2010, శనివారం

సమస్యా పూరణ - కారు నెక్క బోయె కలికి యలిగి

సత్యదేవ్ చిలుకూరి గారిచ్చిన సమస్య
కారు నెక్క బోయె కలికి యలిగి
ఆటవెలదిలో పూరించాలి

నా పూరణ - 1

ఆ.వె||
నీవు కలివి. ఔను, నీవు నా కలివి నా
ఆకలివి. అరెనువు ఆశనివిగ.
పొఫ్ఫొ! యనదలింప, పోయి రైరయ్యని
కారు నెక్క బోయె కలికి యలిగి
నా పూరణ - 2
ఆ.వె||
కారు మబ్బు కమ్మె, కటిక చీకటి చిమ్మె
కన్నె కలికి వన్నె గన్న వెఱ్ఱెక్కిన
కుఱ్ఱకారు కారుకూతల జోరుకు
కారు నెక్క బోయె కలికి యలిగి

సత్యదేవ్ చిలుకూరి గారి అద్భుత పూరణ
ఆ.వె||
చీర వంద కాదు ఆరేడు డాలర్లు
బేరమాడు చుండె బేల యొకతె
బోరు కొట్టి మగడు భోర్భోరునేడ్వగా
కారునెక్క బోయె కలికి యలిగి

పద్మపోడూరిగారి పూరణ-1 కి నా సవరణతో
ఆ.వె||
చారు లోన ఉప్పు జర తక్కువైయ్యెగ
కూర కాస్త మాడె కొంత బొగ్గు
గయని నోరుజారగను, కొరకొర చూచి
కారు నెక్క బోయె కలికి యలిగి
పద్మపోడూరిగారి పూరణ-2 కి నా సవరణతో
ఆ.వె||
చీర వంద గజము ఆరు డాలర్లకె
మూర రవికె మదుపు ముప్పదెటుల
గునని నోరు జారగ నను కసిరికొట్టి
కారునెక్క బోయె కలికి యలిగి

28, జులై 2010, బుధవారం

మత్తేభ ఘీంకారమా! మూషికా చుంచునాదమా!

హ్యూస్టన్లో జరగబోయే అష్టావధంలో పృచ్ఛకుడిగా వ్యవహరించమని శాయి రాచకొండ ఆఙ్ఞాపించారు, నేనేదో పద్యాల్లో పిస్తా అనుకొని. ప్రయత్నించకుండా ఓడిపోవడం కన్నా, ప్రయత్నించి విఫలమవ్వడమే ఉత్తమమని, అంగీకరించాను. అప్పుడు ఆంధ్రామృతం, శంకరాభరణం, తెలుగు పద్యం, బ్లాగాడిస్తా, ఊకదంపుడు, ప్రజా బలం, ఇలాంటి కొన్ని పద్య ప్రియుల బ్లాగుల్ల్ని శోధించి, ఈ దత్తపది తయారుచేసుకొన్నాను.

కాఫీ అట్టు, ఇడ్లీ, పూరీ, ఉప్మా - ఈ పదాలను ఉపయోగిస్తూ, ముంబాయి మారణకాండని గజేంద్ర మోక్షానికి అన్వయిస్తూ, మత్తేభంలో.

కానీ పూరించడమెలా? ఒకవేళ అవధాని పూరించలేని పక్షంలో పృచ్ఛకుడు దాన్ని పూరించే స్థితిలో ఉండాలి, లేకపోతే అభాసుపాలు కాకతప్పదని ఆచార్య చింతా రామకృష్ణారావుగారు చెప్పియున్నారు. తప్పులూ, తడకలతో, ఏవో చిన్న చిన్న కందాలు తప్పా, వృత్తాలు రాయలేదే!
కం
రాయగ నైతిని వృత్తము
రాయని మురిపింపగన్, సరసులొప్పంగన్.
సాయము సేయగ రారా
పూయగ విద్యా సుగంధముల్ పదశిఖరా!
అని కవిశేఖరులని వేడుకోవడం జరిగింది. ఆచార్య చింతా రామకృష్ణారావు (ఆంధ్రామృతం) గారు ఈ విధంగా పూరిస్తూ,

కసభుక్కీలదురంత నక్ర మిచటన్ "కాల్చుండిది డ్లీయనన్"
ముసుగుల్ దాలిచి పట్టె మమ్ము గనుమా! పూరీ జగన్నాయకా!
ఉసురుల్ తీయగ నుండె కావుమిలలో ఉప్మాక దేవా మమున్
విషమంబియ్యది. యిట్టి చిన్న పనికా ఫిర్యాదటంచెంచకన్!
(కాల్చుండు + ఇది + ఈ +డ్లీ ( ఈ + ఢిల్లీ = ఇడ్లీ ) = కాల్చుండిదిడ్లీ)

(ముసుగు = పొగు ముసుగు)

నన్ను స్వంతంగా ప్రయతించమన్నారు. అనేక దోషాలతో కూడిన నా పూరణ ఇలా సాగింది:

నరుడై యార్తిని జుఱ్ఱుకొంగొనిన ముంబైయ్యవ్వనిన్ నే, కసా
యిరురువ్వై వధియించె ప్రాణులను. ఓ పూరీ జగన్నాధ! ఇ
డ్లియు కాఫీలిడుతున్. హ*. కావుమయ! హూం**! ఘర్జించె నాశ్రీహరే
నరుడై అట్టుడకంగ, నా కసబు అంతంబయ్యె. ఉప్మాక శ్రీ!
రురువు = మృగము
హ* నిరాశతో కూడిన ఒక నిట్టూర్పు
హూం** ఆ ఘీంకార శబ్ధము హూం అని వినిపించుచున్నది
వ్యాఖ్యానము/వివరణ:
గజేంద్రుడు, ఉప్మాక క్షేత్ర దైవము అయిన మహా విష్ణువు కలి యుగంలో మంచి స్నేహితులు. మన కొత్త తెలుగు సినిమాల్లో కుఱ్ఱ హీరో నాన్నని ఒరేయ్ అని, అమ్మని ఒసేయ్ అన్నంత స్నేహమన్నమాట. ఉప్మాక (ఉపమా + క = పోలికలేని, సాటిలేని, అని నా స్వంత అభిప్రాయము) స్వామి తో గజేంద్రుదు ఇలాచెప్తున్నాడు.

నేను మానవావతారం ఎత్తి, మానవులకు మాత్రమే ఉండే కామప్రకోపపైత్యాదులకు లోబడినవాడినై, దేహార్తిని తీర్చుకొనుటకు వారవనితైన ముంబాయి మహానగర యవ్వన అందాలను తిలకిస్తుండగా, ఒక కసాయి, మృగమువలె కనబడుచున్న ప్రాణులన్నిటినీ హతమొందించెను. గత జన్మలో నన్ను కాపాడినట్టె, ఇప్పుడు కూడా కాపాడవయ్యా, ఓ పూరీ జగన్నాధా, నీకు ఇడ్లీ కాఫీ లాంటి ఉపహారములు కూడా ఇస్తాను అని ప్రార్ధించగా (మరి ఈ కాలంలో దేవుడికి కూడా లంచాలు ఇవ్వాలి కదా), వెంటనే, ఆ శ్రీహరే, తన గత జన్మ నృసింహావతారమును తలపించే విధంగా ఘీంకరించాడు. ఆ ఘీంకారమున కా కసబనే కసాయి మరణించాడు. కథ అయిపోయింది, పవళింపుసేవ చాలిక లేవవయ్యా, ఉప్మాక పతీ!
నా మూషికానాదంలో తప్పులు చూపమని, వీలైతే సవరణలు చేయాల్సింది గా రవి (బ్లాగాడిస్తా) గారిని, వారి సలహాపై భైరభట్ల (తెలుగు పద్యం) గారిని సంప్రదించాను. భైరవభట్ల గారు,

"కాఫి" బదులు "అట్టు" అయితేనే బాగుంటుందేమో. "కాఫీ" ఇచ్చినా అది "కాపీ" కింద మార్చుకొని పూరిస్తారు. అలాగే ప్రత్యేకించి ముంబయి మారణకాండ అని అడగడం కన్నా, తీవ్రవాద సమస్యని గజేంద్రమోక్షంతో అనుసంధానించి చెప్పమంటే పోలికకి బాగుంతుందని నాకనిపించింది. ఆ భావంతో నేను చేసిన పూరణ:

ఉపమానమ్ము గజేంద్రుతో జగతికిన్నూహింపగా నౌను ఘో
ర పిశాచమ్మగు తీవ్రవాద ఝష దంష్ట్రన్ జిక్కినట్టుండె దా
విపరీత ద్విషపూరితంబులయి కంపించెన్ యువస్వాంతముల్
తపనల్ దీరగ చక్ర రక్షనిడి లీలన్ బ్రోవరా యీశ్వరా!

పూరణలో యతులు సరిపోలేదు (చివరిపాదంలో తప్ప). "రురువు" + "అయి" = "రురువై" అవుతుంది కాని "రురువ్వై" అవదు. "ఉపమా" ని "ఉప్మా" చెయ్యడానికి వ్యాకరణం ఒప్పుకోదు :-) అది "ఉప్మాక" దేవుడిని సూచించినట్టుగానే తీసుకోవచ్చు కదా.


ఈ వ్యవహారమంతా, ఈమైల్సు ద్వారా కనుక ఎవరు స్పందిస్తారో, ఎవరు స్పందించరో తెలియదు
కదా (అడిగన అంతమందీ ప్రత్యుత్తరమిచ్చారనుకోండీ)! అందుకని నా దగ్గర ఉన్న చివరి
బ్రహ్మాస్త్రం ప్రయోగించడనికి సిద్ధపడ్డాను.


మానాప్రగడ శేషశాయి గారు, విజయనగరం మహరాజా సంస్కృతకళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు. వారిల్లు మా ఇంటి పెరడులోనే ఉంటుంది (చిత్రంలో, కూర్చున్నవారు ఎడమ నుంచి కుడి: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మానాప్రగడ శేషశయి. నిల్చున్న వరుసా మధ్య ఇద్దరూ, అమ్మా, నాన్న). అందుకని, మా అమ్మని విసిగించి, అమ్మతో చెప్పాను, "అమ్మా ఆయనకి ఈ పద్యం ఒకసారి చూపించు. సవరణలు చేస్తారు" అని. కాకపోతే ఆయనంటే భయం, "ఎవడ్రా ఈ పద్యం రాసిందీ, ఇన్ని దోషాలతో" అనిఅంటారని. కాబట్టి ముందే చెప్పాను, ఒకవేళ అక్షింతలు పడితే "అవి నావే, నీవికాదు" అని ఒప్పించాను. ఆ పద్యం చూసి, కొంచెం వినికిడి, దృష్టి తగ్గినా, ఎన్నో పనులున్నా అవన్నీ మనుకుని, పద్యాన్ని పూర్తిగా మార్చకుండా, "మనం వాడి లోకి పరకాయ ప్రవేశం చెయ్యాలే. మనంతట మనం రాసిస్తే వాడికి సంతృప్తి ఎక్కడుంటుందీ" అని, ఒక పావుగంట సేపు ప్రయత్నించి, ఇచ్చిపంపారు. నా పూరణ కి వారి సవరణ ఇదిగో:
పరుడైఆర్తినిజుఱ్ఱుకొంగొనిన ముంబై జవ్వనిన్ రే కసా
బుర్వై మ్రింగెనుప్రాణిలొకమడలన్ ఓ పూరీశ్రీ నాధ సాం
బరు ఇడ్లీ ఉపమా దయన్ గొనుచు బ్రోవన్ రావెనీవె
పరాత్ప్రరవేవేగ హరింపనట్టుడుకు వంతన్ భక్త చింతామణి!

ఆ ఒక్క, "నరుడై" ని "పరుడై" గాను, "నే" ని "రే " గాను మార్చి, ఎంత అర్ధవంతంగా మార్చారో గమనించారా. ఆవిధంగా, మూడుమత్తేభ ఘీంకారాలు, ఒక మూషికానాదంతో, దత్తపది అంకం ముగిసింది. ఇందుకు ఇతోధిక సహాయం చేసిన కవిశేఖరులు: ఆచార్య మానాప్రగడ శేషశాయి, ఆచార్య కంది శంకరయ్య, ఆచార్య చింతా రామకృష్ణారావు, శ్రీ రవి (బ్లాగాడిస్తా), శ్రీ భైరభట్ల. వీరందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

వద్దిపర్తి పద్మాకర్ గారి అష్టావధానం - హ్యూస్టన్ విశేషాలు

అవధాని - వద్దిపర్తి పద్మాకర్ (ఏలూరు)
నిర్వహణ - శాయి రాచకొండ
సభాధ్యక్షుడు - జె.వి. రమణమూర్తి
శాలువ - ముత్యాల భాస్కర రావు
సాంకేతిక సహకారం - రాం చెరువు
వేదిక - అంజలి నాట్యకళాకేంద్రం, హ్యూస్టన్
ప్రాయోజకులు - హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (T.C.A - Houston)

1. అప్రస్తుత ప్రసంగం - వంగూరి చిట్టెన్ రాజు
2. సమస్య - మురళి అహోబిలవఝ్ఝల - ఉత్పలమాల
రాముడు పార్వతీ తనయు డారయ సీత మహేశు పత్నియే
శ్రీమహిళా శిరోమణి వరిష్ఠ విశిష్ఠ పదమ్ములంటి శో
భామయ జీవితమ్మునకు వత్తురటంచునమ్మి నమ్మి సు
త్రాముడు పార్వతీ తనయుడారయ సీత మహేషు పత్నియున్
క్షేమము స్థే*మము కలుగ చెంతకుకుచేరి నమస్కరించరే
3. దత్తపది -సోమశేఖర్ ధవళ [అది నేనే :)]
అట్టు, ఇడ్లీ, పూరీ, ఉప్మా - ఈ పదాలను ఉపయోగిస్తూ, ముంబాయి మారణకాండకు కారకమైన తీవ్రవాదాన్ని గజేంద్ర మోక్షానికి అన్వయిస్తూ, లేదా జ్ఞప్తికి తెస్తూ, మత్తేభంలో ఘీంకారం చేయండి.

కరమట్టుంగని*సనిట్టునూపుచును రాగద్వేష విభ్రాజిత
స్ఫురణా సంపదగల్గి ఇడ్లిచిట ఉచ్చుందీయగా ఆజితో
త్కరమున్ భారతభూమి జేయుటకు రాగా కష్టదుశ్శీలు ఘో
రరణోర్వింబడ ప్రేమపూరితుడు సంరంక్షించు నుప్మాయనన్

4. వర్ణన -మల్లిక్ పుచ్చా - స్వేచ్ఛా వృత్తం
కేదార్నాధ్, హిమగిరి సొగసులు, రుద్ర వేద ఘోష, శంకర గానం, ప్రేక్షకుల తన్మయత్వం
కేదారేశ పవిత్ర లింగమిట సూక్ష్మీభూతమై యొప్పగా వి
ద్యాదీక్షా వర శీతలత్వ విమలత్వంబంది హ్యూస్టన్నులో

కేదారాది సమస్త తీర్ధములు చూడబోనేల కా
దా దక్షుల్ గల మంచిచోటిదియె తీర్థత్వంబునందింపగన్

శార్దూలం (మ స జ స త త గ)

5. న్యస్తాక్షరి - సత్యదేవ్ చిలుకూరి - మత్తకోకిల
పెళ్లి అయిన మొదటి ఆషాఢ మాసం లో కోడలు పుట్టింటికి వెళ్ళడం ఆచారం. అత్తా కోడళ్ళు ఒక గడప దాటగూడదని నియమం. ఆ సమయంలో భార్యాభర్తల విరహ వేదన, మనోభావాలు వర్ణించండి
ఒకటవ పాదం - రెండవ అక్షరం ఖ్య (ప్రాస)
రెండవ పాదం - 13 పా
మూడవ పాదం - 14 స
నాల్గవ పాదం - 3 త్య
సౌఖ్యముండునె నీవులేనిది సర్వలోకమహేశరా
లేఖ్యమైనది నీదురూపమలేఖ్య పాలనశీలుడా
ప్రఖ్యపొందిన శూన్యమాసము బాగుగోసమెకాదొకో
మాఖ్యత్యక్తము చేయూకూడదెమాదు దంపతికోసమై

6. నిషిద్దాక్షరి - సత్య పిళ్ళా - అన్నిపాదాలు - త వర్గం నిషిద్ధం
ఇతివృత్తం - వర్గపోరాటలు మాని జాతి ఐక్యత యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ శాంతి సందేశం
అవధాని ఉవాచ - ఇది ఎప్పుడూ కందంలోనే చెప్పాలి, స్వేచ్ఛా వృత్తం కూడదు
కంద ఛందస్సు ప్రకారం, రెండు, నాల్గు పాదాల యందలి చివరి అక్షరం "న్" కావొచ్చు (త వర్గం నిషిద్ధమైనా గాని)

శ్రీరమ్య విశాల యశో
ఘోరమ్మగు రణము విడిగ కూడగ ప్రజయున్
శ్రీరమ వాణియు ఐక్యము
లో రంజిల్లరొకొ జగములో సుఖమొప్పన్

7. ఆశువు - సుమన నూతలపాటి
ఇతివృత్తం - 1) సమానత్వం అసమానత్వం 2) అంజలీ కార్యకలాపములపై 3) ప్రాణముల్ ఠావుల్ దప్పెను ని హనుమంతుడికి అన్వయిస్తూ

8. పురాణం - సీతారాం అయ్యగారి

* అనుమాన నివృత్తి చేసుకోవలసిన అక్షరాలు

22, జులై 2010, గురువారం

Budlight - యిప్పసారా

కరములు మోడిచి పల్కవె
ఖరముల్, బడ్లైటు పూటు కైపులు లైటూ!
సురసాపానము గ్రోలిన
కరకణు ధార్మికతలనిక కాంచవు రైటూ!


ఓయీ ఒబామా, బుష్షులార!
మిల్లర్ లైటూ, బడ్ లైటు బీర్లు కాకుండా, మా మన్యసీమ ఆర్గానిక్ విప్పసారా తాగండి. యుద్ధొన్మాదమేకాదు, అణుధార్మికతలు కూడా ఛస్తే కనిపించవు సుమా!

అని మా గాడిదలు కూడా చేతులెత్తి సవినియంగా నమస్కరిస్తూ చెప్పగలవు.

16, జులై 2010, శుక్రవారం

ముక్కుపుడక - అసూయ

ఛ.లే.ప||*
చక్కగ చెక్కిన, పసిడి ముక్కెరనిడ,
మక్కువ పద్మనాధుని కాంతులిడి, తళుక్కుమనెనె,
అప్ప్రకాశంబునన్, మ్రుక్కునవ్రేలిడు అమ్మలక్కల
లక్కసునసూయలు గోచరించెను సుస్పష్టముగనున్

బంగారంపు ముక్కుపుడుక పై ముచ్చటపడి
పద్మనాధుడు అంటే, సూర్యుని కిరణలు పడగానే
ఆ ప్రతికిరణాల ప్రకాశంలో, వెలుగులో, మిగతా అమ్మలక్కందరి
అసూయ, ఈర్ష్యలు స్పష్టంగా కనిపించాయి

* ఛ.లే.ప - ఛందస్సు లేని పద్యం :)

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును