19, ఏప్రిల్ 2009, ఆదివారం

మల్లెల మాలలూగక మానునా, మాయునా?

మల్లీశ్వరి సినిమాలో "మనసున మల్లెల మాలలూగెనే" పాట ఏమాత్రం అభిరుచి ఉన్న శ్రోతలకైనా తెలుస్తుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కలం నుంచి జాలువారిన తెలుగు సొగసుల సిరి మల్లెల మాలలు ఆ సినిమాలోని మాటల పాటలు, పాటల ఆటలు.

వారి మేనకోడలు, అవసరాల (వింజమూరి) అనసూయాదేవి గారు ఎన్నో జానపద గీతాలని ఆంధ్రదేశమంతా తెరిగి, వెతికి పట్టి, బాణీలు కట్టి, స్వరబద్ధం చేసినవారుగా చిరపరిచితులు. వారి కృషిని మెచ్చి, ఆంధ్రవిశ్వవిద్యాలయం వారు "కళాప్రపూర్ణ" బిరుదుతో ఆవిడని సముచితంగా సత్కరించారు. వారిని 22 వ టెక్సాస్ తెలుగు సాహితీ సభల సందర్భంగా కలవడం జరిగింది. ఆవిడ మాట్లాడుతూ కొన్ని ఆశక్తికరమైన విషయాలని చెప్పారు. మల్లెశ్వరి లో, "నోమీ నోమన్నలాలొ" పాటకి, అలాగే "మనసున మల్లెల" పాటకి కూడా, బాణీలు ఆవిడే సమకూర్చేరుట (కానీ సినిమాలో రాజేశ్వరరావు గారీ పేరే కనబడుతుంది). అందుకే
కృష్ణశాస్త్రి విరచితమవ్వంగ
వింజమూరి రసస్వర వింజామరలు
విసురుగ విసరంగ, మనసున మల్లెల మాల
లూగక మానునా, మాయునా!
ఆవిడ కుటుంబానికి ఎంతోమంది పేరిన్నిక గల కవుల ( విశ్వనాధ, కొకు, శ్రీశ్రీ, చలం...) తో ఉన్న సన్నిహిత భాంధవ్యాల గురించి, ఆవిడ స్వంతమాటల్లొ ఇక్కడ వినండి (నిడివి 19 ని||)



(ఆ గొంతుక విన్నవారెవ్వరు, ఆవిడకి 89 సంవత్సరాలంటే నమ్మకపోవచ్చు)

15, ఏప్రిల్ 2009, బుధవారం

యథా ప్రజా - తథా రాజా

గత కొన్ని నెలలుగా బ్లాగ్లోకంలో ఫొటోలుపెట్టి మరీ విమర్శలు చేస్తూ, మా జాతిని మొత్తం అవమానపరుసున్నందుకు మనస్తాపం చెంది నేను రాస్తున్న బహిరంగ లేఖ.


(శబ్దరూపంలో)

మాపై వచ్చిన ప్రధాన ఆరోపణలు: నీతి, నిజాయితి, సమదృష్టి, నైతికవిలువలు, పారదర్శకతవంటివి లేకపోవడం. డబ్బు-పరపతి లకోసం ప్రాకులాడ్డం, సహనం కోల్పోయి నోటికొచ్చినట్టు మాట్లాడ్డం. ఇవి ఒక రాజకీయనాయకునికి ఉండాల్సిని కనీస అర్హతలు అని . ఇవన్నీ మాలో మాత్రమే ఉన్నాయా, వీటిలో మీరుపట్టభద్రులుకారా అని నేను మిమ్మల్ని ప్రశ్నించదలచుకొన్నాను. ఇది ఎన్నికల సమయం కాబట్టి మమ్మల్ని ఆడిపోసుకోవడం మరీ ఎక్కువయ్యింది. డబ్బు విచ్చలవిడిగా ప్రవహిస్తుంతోందని. మద్యం ఏరులై పారుతోందని.

ఏమయ్యా, బాబూ, కొంచం సాయం చెయ్యవయ్యా అంటే, "నా కేంటి" అనే మనస్తత్వం నీది. నీవాటా ఇవ్వకుండా రమ్మంటే, మరి నీ పనులన్నీ మానుకొని నువ్వొస్తావా? అయినా మేం చేసే ఖర్చువల్ల ఒనగూరే సామాజిక న్యాయం మీకర్ధమవ్వట్లేదు. అధికారంలో ఉన్నప్పుడు సంపాదిస్తాం. ఎన్నికలప్పుడు ఖర్చుపెడతాం. అవసరమైతే ఖర్చుపెట్టిస్తాం కూడా. మేము దోచిన సొమ్ముని మళ్ళీ మీ దోసిళ్ళాలోనే కదా పోస్తున్నాం. ఇంతకు మించిన ఎకనమిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఈ ప్రపంచంలోనే లేదు.

మీ సాఫ్టువేరు/హార్డువేరు కంపెనీల్లో, వేరేవాడు ఒక పదివేలు ఎక్కువిస్తానంటే చెప్పాపెట్టకుండా ఉద్యాగాలు దూకెస్తారే? మరి పార్టీలు దూకితే మమ్మల్నెందుకంటారు. మాకు మారడానికి మహా అయితే మూడుపార్టీలున్నాయి. మీలాగ పదుల/వందల సంఖ్యలో లేవు. అందునా దూకడం మా జన్మహక్కు. మాక్కూడా పైకెదగడానికి మీతోపాటూ సమనావకాశాలు కావాలి, రావాలి. ఇందుకు మేం చట్టాలు చేసుకొంటాం. ప్రజల కోసం - ప్రజల కొఱకు అన్న నానుడిని మా అంతబాగా నిజంచేస్తున్నవారెవరో మీరు చెప్పండి.

మీరు దేశంకోసం ఏమైనా చేసారా? మీరెవరికైనా ఉద్యాగాలిప్పించారా? అదీ ఏ అర్హతలేని వాడికి. మా వల్ల ఎందుకూ కొరగాని వెధవాయలెందరికో ఉపాధికల్పిస్తున్నాం. కావాల్సిన అర్హత ఒకేఒక్కటి. అది నమ్మకం, అంతే. వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని పెద్దన్నలా పోషిస్తున్నాం. మేమే లేకపోతే, నిరుద్యోగ సమస్య పెనుభూతమై మీ ఉద్యోగాలనీ కబళిస్తుంది. మీకు చేతకాని పనులెన్నో మేము చేస్తున్నాం. చేసి చూపిస్తున్నాం. అయినా మా మీద ఏంటో మీ ఏడుపు.

తిరుపతి లో భగవంతుని దర్శనానికి క్యూలో నిలోచోడానికి కూడా మీకు బద్దకం. VIP దర్శనం దొరికిందని నలుగురిలో గొప్పగా చెప్పుకోవాలని ఆరాటం. అందుకు మా MLAల, MPల, లెటర్లు కావాలి. అప్పుడు గుర్తొచ్చామా మేము? పదిమందిలో మా వాడు మంత్రి, మాచుట్టం కంత్రి అని చెప్పుకోవడానికి కావాలి. మీకు కాంట్రాక్టులు పనులు కావాలంటే మేము చక్రం తిప్పాలి. అప్పుడు మాత్రమే గుర్తొస్తామా మేము? ఇంతా చేసీ, చేడీ, పబ్లిగ్గా తిట్టడానికి ఎవరు అప్పనంగా దొరుకుతార్రా అంటే, మేమే. ఇంకెవరు. ఇంకెవిరినైనా అంటే పడతారా వాళ్ళు. మీ బొమికలేరరు.


కులాలు మతాల గొడవలు: ఎందుకలా కొట్టుకు చస్తారు. మాదంతా ఒకే కులం: రాజకీయం. మాది ఒకే మతం: స్వలాభం. మాకు లేని కులాలు, మతాల గొడవలు మీకెందుకు. ఈ పార్టీ, ఆ పార్టీ అనే బేధభావనలు మాకులేవు. అంటరానితనం అసలే లేదు. మేమంతా ఎంతో ఐకమత్యంగా ఉంటాం. కొట్టుకున్నట్టు మీ కళ్ళకి కనిపిస్తాం. ఎందుకంటే, మీరు గ్రుడ్డివాళ్ళు కాబట్టి.

మీరు ఉద్యాగోలు కోసం ఎగబడుతూ, లేని విద్యార్హతలు సృష్టించుకోలేదా? లేని అనుభవాన్ని ఉన్నది గా చెప్పుకొని ఉద్యాగాలు సంపాదించలేదా? CVలు, రెస్యూమెలు కూడా కాపీ కొట్టలేదా? మేమూ అలాగే చెప్తాం, చేస్తాం. సంఘసేవ చేసామని, చేస్తామని. ప్రజల కష్టాలు తెర్చడమే మా పరమావధి అని. మీరే అబద్ధాల పుట్టలైనప్పుడు, మీకెందుకు నిజాలు చెప్పాలి? మీరుచేస్తే ఒప్పు. మేము చేస్తే తప్పునా? ఇదక్కిడి న్యాయం? ఎందుకీ ద్వందప్రవృత్తి?

పెళ్ళో, చావో వచ్చినప్పుడు కరెంటు స్తంభానికి తీగలు తగిలించి విద్యుత్తు చౌర్యం చెయ్యడం లేదా? పొలాల్లొ, అక్రమంగా మీటర్లు టాంపరింగి చెయ్యట్లేదా? సాగుకాలువలని దారి మళ్ళించి, మీ కమతానికి నీరందితే చాలు, కిందవాడేమైపోయినా పర్వాలేదు అనుకోవట్లేదా? బందులు, హర్తాళ్ళు అంటూ, బస్సులు, ఆసుపత్రులు, కార్యాలయాలు తగలపెట్టి ప్రభుత్వఖజానా కొల్లగొట్టట్లేదా? ఇంత బహిరంగా దోపిడీ చేసే మీరు మా ఆదాయవవరులని ప్రశ్నించే హక్కు ఎప్పుడో కోల్పోయారు!

మేనిఫెస్టోలో చెప్తాం. ఎన్నో చెప్తాం. అది చేస్తాం ఇది చేస్తాం అని. అంటే అన్నె చేసెయ్యాలా? చెయ్యగలమా? చెయ్యనిస్తారా? మీరు పైదేశాలకి చదువలకని చెప్పి, "నేను చిన్నప్పట్నుంచి ఐనిస్టీను లాగ ఆలోచించే వాడిని. నా వల్ల మీ యూనివర్శికే కళ పెరుగుతుంది" లాంటి కల్లబొల్లి కబుర్లు చెప్పరా? ప్రగల్భాలు పోరా? వాగ్ధానభంగంచేసినందుకు మీ డిగ్రీలన్నీ బర్ముడ ట్రయాంగిల్ లో విసిరిపారెయ్యాలి అసలు. అదిసరే, పోనీ మనదేశంలో డిగ్ర్రీలు అంటే, మార్కెటులో పట్టాలు కొనుక్కోవట్లేదా? ర్యాంకులు కొనుక్కోవట్లేదా? చదువులు కొనుక్కోవట్లేదా? మీ దురాశకి అంతనేది ఉందా. ఇలా వేలమంది దోచుకుంటున్న ధనరాశి ముందు, మా సంపాదన ఎంత. మీరు వేసే ముష్టి తో సమానం. పక్కవాడ్ని నొక్కి, తొక్కిపైకెళ్ళడం. ఇది అందరి ప్రాధమిక హక్కు. కాదనే అధికారం మీకు లేదు.


మా ఆస్తుల చిట్టా విప్పి, అయ్యో నీకు కారు కూడా లేదని వాపోతారు, పాపం జాలి చూపిస్తారు, కాదు కాదు మా బీదరికపుపాట్లని చూసి గేలీ చేస్తారు. ఎగతాళి చేస్తారు. మరి మీ సంగతేంటి? ఇన్-కం టాక్సు ఎగ్గొడ్డానికి నానా అవస్థలూ పడతారు. నానా సంకలూ నాకుతారు. కానీ కుళాయి కావాలి. కరెంటు కావాలి. గిరెంటు కావాలి. ప్రభుత్వం నుంచి సకల సౌకర్యాలు కావాలి. మనం మాత్రం జేబులోంచి పైసా తియ్యం. ఇన్-కం టాక్సు వాడికి పది రూపాయలని చూపించిన ఆదాయం, అదే వీసా అప్లై చెయ్యాడానికి వెయ్యురూపాయలయ్యి కూర్చుంటుంది. మా ఆస్తి కూడా అంతే గురువుగారు. సందర్భం బట్టి దాని విలువ పెరుగుతుంది లేదా తరుగుతుంది. తగ్గకపోతే తగ్గిస్తాం. ఏం మీరుచెయ్యగా లేనిది, మేము చెయ్యకూడదా?

ఇంక ఏదో మా భాష గురించి, మా నైతికవిలువలు గురించి, మా సభ్యత-సంస్కారాల గురించి. పాపం మీరు పెదవులు విరిచి విరిచి, అవి రెండు చెక్కలు, మీ మండే గుండె మూడు ముక్కలు అయ్యాయి కాబోలు. మీరు చదువుకున్నా వారు ట. సంస్కారవంతులు ట. మరి మీ భాష అలా అఘోరించిందేం. ఎందుకలా ప్రాముఖ్యతకోసం పాకులాడతారు. ఎందుకలా వీధి కుక్కల్లా కొట్టుకుంటారు. ఎందుకలా కాకుల్లా చెవులు చిల్లులు పడేలా తిట్టుకుంటారు. ఎవరు ఎవరికీ తెలియనప్పట్టికి "అటుతంతాం, ఇటు తంతాం" అంటూ అపర ఘటోత్కచుడిలా చిందులు తొక్కుతారు. వందమందికూడా లేని మీలోనే నమ్మకంలేదు. మర్యాద లేదు. మన్ననలేదు. పెద్దరికంలేదు. కట్టుబడిలేదు. మరి వేలమంది మూర్ఖులు, అదే అభిమానులున్న మాకెలా సాధ్యం అనుకుంటున్నారు.

మేమెక్కడినుంచో ఊడిపడలేదు మహాప్రభో. మేము గ్రహాంతరవాసులం అంతకన్నా కాదు. మేంకూడా మీలో ఒకరమే. విమర్శలు చేసేముందు ఆ విషయం మరచిపోకండి.

మార్పురావాలి అంటే, అది మీలోంచే మొదలవ్వాలి. మా నుంచికాదు.
యథా ప్రజా - తథా రాజా

ఇట్లు
- ఒక రాజకీయ నాయకుడు

10, ఏప్రిల్ 2009, శుక్రవారం

test


\int_{0}^{1}\frac{x^{4}\left(1-x\right)^{4}}{1+x^{2}}dx
=\frac{22}{7}-\pi

పద్యం - వృత్తాలు - అంకెలు

సాంప్రదాయకంగా మనం పద్యాల ఛందస్సుని నేర్చుకున్నప్పుడు
" ఈ పద్యానికి ఈ గణాలు ఫలానా వరుసక్రమంలో రావాలి"
అని నేర్చుకుంటాం. ఉదాహరణకి, ఉత్పలమాల తీసుకుందాం.
"భ ర న భ భ ర వ"
UII - UIU - III - UII - UII - UIU - IU
అనే గణాలు వరుస క్రమంలో ప్రతిపాదంలోనీ రావాలి.
అనగా లఘువులు, గురువులు (మొత్తం కలిపి 20) ఈ క్రమంలో రావాలి. అదే లఘువుని "౦" గానూ, గురువుని "1" గానీ గుర్తించామనుకోండి: అప్పుడు వచ్చే సంఖ్య
UII - UIU - III  - UII - UII -  UIU - IU
100 - 101 - 000 - 100 - 100 - 101 - 01

ఆ సంఖ్యని దశాంసమానంలో రాస్తే 607381

ఒకవేళ ఎక్కడైనా ఒక గణం తప్పయ్యిందనుకోండి, ఉదాహరణకి, చివరి "IU" కి బదులుగా "II" అనే గణాలు మీపద్యంలో పడ్డాయనుకోండి, అప్పుడు, మీ పద్యంలోని పాదం యొక్క సంఖ్య
UII  UIU III   UII UII   UIU II
100 101 000 100 100 101 00
607381 - 1 = 607380

గణం చివరిదయ్యింది కాబట్టి, సులువుగా పట్టేసాం. మరి ఎన్నే చోట్ల తప్పుంటే? ఏ స్థానంలో తప్పుందో కనుక్కోవడం ఎలా?

అది ఆలోచించే ముందు, exclusive-or లేదా xor అనే బూలియన్ సూత్రం చూద్దాం. దాని ప్రకారం:
0 + 0 = 0
0 + 1 = 1
1 + 0 = 1
1 + 1 = 0

దీన్ని ఉపయోగిస్తే మనం తప్పు ఎక్కడుందో ఇట్టే పట్టేయొచ్చు. ఇందాక ఉదాహరణని తీసుకుంటే:
100 101 000 100 100 101 01
+
100 101 000 100 100 101 00
=
000 000 000 000 000 000 01

కాబట్టి, ఎక్కడైతే, మనకి ఒకటి కనిపిస్తుందో, ఆ స్థానాలన్నిటిలోనూ గణం తప్పిందని తెలుస్తుంది. పై ఉదాహరణలో 20 వస్థానంలో తప్పిందని ఇట్టే తెలుస్తుంది కదూ?

ఇప్పుడు అన్ని (నాకుతెలిసినవి ) వృత్తాలని చూద్దాం:

ఉత్పలమాల:
"భ ర న భ భ ర వ
UII - UIU  - III  - UII  - UII - UIU -  IU
100 - 101 - 000 - 100 - 100 - 101 - 01 = 607381

చంపకమాల:
న  జ  భ  జ  జ  జ  ర
III - IUI - UII - IUI - IUI - IUI - UIU
౦00 - 010 - 100 - 010 - 010 - 010 - 101 = 83093
మత్తేభం:
స భ ర న మ య వ
IUU - UII - UIU - III - UUU - IUU - IU
IIU - UII - UIU - III - UUU - IUU - IU
001 - 100 - 101 - 000 - 111 - 011 - 01 = 207085
శార్ధూలం:
మ స జ స త త గ
U U U - I I U - I U I - I I U - U U I - U U I - U
111 - 001 - 010 - 001 - 110 - 110 - 1 = 469229
వచ్చే టపాలో జాతులు పైన శోధిద్దాం. అంతవరకు శెలవు.
(భైరవభట్ల గారు తప్పు సరిదిద్దినందుకు కృతజ్ఞతలు)

7, ఏప్రిల్ 2009, మంగళవారం

BIG EVENT - చిరు సాయం

పన్నెండు వేల మంది సైనికులు
చేతిలో చీల్చిచెండాడే మరతుపాకులు
రణగొణధ్వనులు చేస్తూ చ్చక్కర్లు కొడుతున్న యుద్ధట్యాంకులు
సైనికాధ్యక్షుడు "ఆగే బఢో" అంటూ ఆవేశంతో ఆజ్ఞాపిస్తూ, సైనిక పట్టాలన్ని యుద్ధానికి సన్నద్ధులని చేస్తుంటే?
ఓహ్ ... ఊహించికుంటుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది కదూ!


మరి ఆ సైనికులు బదులుగా విధ్యార్ధులుంటే
మరతుపాకులకి బదులుగా పలుగులు-పారలు, కుంచెలు, నిచ్చెనలుంటే
సర్వసైన్యాధ్యక్షుడు, తమలో ఒకడై, పదండి ముందుకు, కర్మభూమి ఋణం తీర్చుటకు, అంటూ సేవాతత్పరతని జాగృతపరుస్తుంటే? ఒళ్ళు పులకరిస్తుంది కదూ!


దాని పేరే BIG EVENT.
1982 న TAMU లో ప్రారంభమైన BIG-EVENT, అమెరికా సంయిక్తరాష్ట్రాల్లో విధ్యార్ధులచేత నడపబడే అతిపెద్ద సేవాకార్యక్రమం. దీని ముఖ్యోద్దేశ్యం, స్థానిక ప్రజలకి విద్యార్ధులు వివిధ స్వచ్చంద సేవాకార్యక్రమాల ద్వారా కృతజ్ఞతలు తెలుపడం. ప్రస్తుతం ఇది, మరొక 50 కి పైగా ఇతరకళాసాలలకి వ్యాపించింది.

ఈ సంవత్సరం Child Rights & You (CRY) సంస్థ తరపున ఒక పదిమందికి పైగా భారతీయులం BIG-EVENT లో పాలుపంచుకిన్నాం. అధ్యక్షుడు జార్జ్ బుష్ Sr , గడ్డకట్టే చలిని లెక్క చెయ్యకుండా వచ్చిన పన్నెండువేల పైచిలుకు విద్యార్ధులనుద్దేసించి ప్రసంగించడంతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. ప్రసంగాలూ అవి ముగియగానే, చీమలదండులా బయలుదేరి అందరం పని-ముట్లు సేకరించుకొని, రెండు జట్లుగా విడిపోయి, మాకు అప్పచెప్పబడిన ఇళ్ళకి కి చేరుకున్నాం. ఒక నల్లజాతి వ్యక్తి ఇంట్లో అడుగుపెట్టం నాకు అదే మొదటిసారి. ఆర్ధికతారతమ్యాలని ప్రత్యక్షంగా చూడ్డంకూడా అదే మొదటిసారి.

మాకు అప్పజెప్పిన పనులు పట్టిక చూసుకొని, చెయ్యాల్సిన పనులని విభజించుకున్నాం. ఇద్దరు ఇంటి ముందు పచ్చికని శుభ్రం చేస్తూంటే, మరో ఇద్దరు ఇంటికి బయట వెల్ల వేయడం మొదలు పెట్టారు. మిగిలిన ఇద్దరం వంటగది, పరిసరాలు శుభ్రంచేసాం. తరువాత, బీరువాలు, కిటికీలు, అరుగులకి వెల్ల వేసాం. ఇదంతా అయ్యేసరికి ఒక ఐదు గంటలు పట్టిండి. మిగతా వాళ్ళు కూడా తమ తమ పనులు పూర్తిచేసేసారు ఈ లోగా. పనిలో పనిగా పైంట్ డబ్బాలు ఒలకబొయ్యడం లాంటి అప్పజెప్పని పనులు కూడా చేసాం. పూలకుండీలు చేతిలోంచి జారిపోతే, క్షమాపణలతో పాటు, పరిహారంగా ఒక పదిహేను డాలర్లు సమర్పించుకోవడంతో, మా కార్యక్రమం పూర్తయ్యింది. పనిముట్లన్నీ తిరిగి ఇవ్వడంతో, మా వరకు BIG-EVENT అయిపోయింది. పాలుపంచుకున్నందుకు సంతృప్తి మిగిలింది. ఇలాంటి కార్యక్రమాలు మన కళాశాలల్లో కూడా జాతీయ స్థాయిలో చేస్తే బావుంటుందనిపించింది.

అసలు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే:

మేనేజిమెంట్, ఎడ్వర్టయిజింగ్, ట్రాన్స్పొర్టేషను, ఐ-టి, హాస్పిటలిటి, లాజిస్టిక్సు, ఇలా ఎన్నో బిభాగాల కో-ఆర్డినాషన్ కావాలి. ఇవి ఆయా సబ్జెక్టులు చదువుతున్న విద్యార్ధులకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ని పెంపొందించడానికి ఎంతో తోడ్పడతాయి. కలగూరగంప లో తాడేపల్లిగారు చెప్పినట్లు, అవకాశాలని మనం సృష్టించుకోవాలి. ఈ ఒక్క ఈవెంట్ ద్వారా, విద్యార్ధులు క్లాసురూములో నేర్చులోలేని ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు. పాశ్చాత్యదేశాల్లో అమలవుతున్న "మంచిని" కూడా మనం సంగ్రహించాలి. నేషన్ బిల్డింగ్ కి పునాదులు విశ్వవిద్యాలయాల్లొనే అని నా నమ్మకం. అవి రాజకీయాలైనా, వృత్తివిద్యలైనా, మరేదైనా. ముఖ్యాంగా మన తెలుగుసినిమాల్లో కాలేజీలు అంటే, సొల్లు-కబుర్లు చెప్పడం, అధ్యాపకులతో కుళ్ళు జోకులు వెయ్యడం, అమ్మాయల్ని ఏడిపంచడనికి తప్పా మరెందుకూ ప్పనికిరాని రోడ్దుపక్క బడ్డీకొట్లులాగ చూపిస్తున్న పరిస్థితులు మారాలని ఆశిద్దాం.

-శెలవు

1, ఏప్రిల్ 2009, బుధవారం

తెలుగు పద్యానికి compiler?

భైరవభట్ల గారు, పద్యం.నెట్ మీద టపా రాసినప్పుడు,
పద్యం.నెట్లో, (నాలాంటి) ఔత్సాహికులు పద్యాలు రాయప్రయత్నిస్తే, వ్యాకరణ పరంగా అవి సరియైనవా, లేక, వాటిలో తప్పులు ఏమైనా ఉన్నాయో గుర్తించి, సవరణలకి సూచనలు చేసే సౌలభ్యం ఉంటేబావుంటుంది
అని వ్యాఖ్యరాద్దామనుకుంటూనే, మళ్ళే, ప్రతీ పద్యాన్ని పరీక్ష చెయ్యడం, ఎంత ఖాళీ సమయమున్నా కుదరకపోవచ్చని ఆగిపోయాను. మరి పరిష్కారమేంటి అని అలోచిస్తుండాగా ఇలాతోచింది. ఇది ఎంతవరకు సాధ్యమో (అసాధ్యంకాదు అని నా నమ్మకం) తెలుగు సాఫ్టువేరు జనులు చూడండి:

తెలుగు పద్యానికి వ్యాకరణం ఉన్నాది. గణ విభజన, యతి-ప్రాస, మినహాయింపులు ఇత్యాదులు. ఇవన్నీ చూస్తే, తెలుగు పద్యానికి ఒక compiler ( lexicon analyzer + syntax analyzer మాత్రమే) తయారుచేయడం (మరీ)అంత కష్టంకాదనిపిస్తుంది,

ఉదాహరణకి (laTeX ని అనుకరిస్తూ):
\begin{ATaveladi}
uppugappurambu nrokkapolikanunDu \\
chooDachooDa ruchula jaaDa vaeraya \\
purushulandu puNya purushulu vaeraya \\
viSwadaabhiraama vinura vaema \\

\end{ATaveladi}

పై పద్యాన్ని, compile చేసిన తరువాత, ఆటవెలది లో ఉండాల్సిన గాణాలు లేవనో, ఒక వేళ యతి తప్పితే, ఏ పాదంలో తప్పిందో చెప్తూ, యతి-ప్రాస కుదిరే అక్షరాల్ని సూచించడం లాంటి పనులు సాఫ్టువేరు ద్వారా చేస్తే?


వీటిలో అనుభం ఉన్నవారు, మీ అభిప్రాయాలని తెలియజేయండి. కష్టసాధ్యం కాదు అనుకుంటే, ప్రయత్నించవచ్చు కూడా! ఒకవేళ ఇలాంటి పరికరాలుంటే, నాకు సూచించగలరు.

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును