శ్రీముఖ వ్యాసపౌర్ణమి
తేదీ 3-7-1993
శ్రీరస్తు, శ్రీమత్పరదేవతాయైనమః
బ్రహ్మశ్రీ వేదమూర్తులు, బ్రహ్మనిష్ఠులు, తపస్సంపన్నులు, శ్రీ ధవళ శ్రీరామావధాని మహోదయులకు, వారి సహస్రచంద్ర దర్శన మహోత్సవ సందర్భమున సమర్పించిన పద్యపుష్పోపహారము
శా||
శ్రీవాణీహిమవద్గిరీంద్రతనయాసీమంతినుల్ ప్రేమనెం
తే వక్షోముఖపార్శ్వ భాగములయం దేపారగా నొప్పు నా
శ్రీ వైకుంఠవిధీందుశేఖరులు పేర్మిన్ బ్రోచుతున్ వేదవి
ద్యావాచస్పతి నీ బుధున్ ధవళ వంశాంభోధి రాకాశశిన్
సీ||
ఏబదేండ్లకు మున్నె యెంతయు భక్తితో
జంద్రశేఖర యతిస్వామి విమల
పాదపద్మమ్ములు స్వాంతమ్మునన్ నిల్పి
యర్చించునట్టి పుణ్యాత్మకుండు;
శంకరమఠము విజయనగరంబున
నెలకొల్పినట్టి ధన్యులను మిన్న
వేదమూర్తియు, శ్రౌతవిద్యావివేకియు,
మంత్రమూర్తియునైన మాన్యతముడు
గీ||
ప్రేమతోడుత నన్ను నెవ్వేళగాంచు
నట్టి మామక మాతులు ననవరతము
గొలుతు సధ్బక్తి గురుమూర్తి నలఘుయశుని
ధవళ వంశ్యు శ్రీరామావధాని, ననఘు
శా||
వేదోపాసనచే బవిత్రులయి సద్విఖ్యాతి నార్జించుటే
కా దెన్నోక్రతువుల్ పొనర్చి త్రిదివాగ్రస్వాస్థ్యముం గాంచి రెం
తే దాతల్ మఱితండ్రు; లాసరణినట్లే పూని మీ వంశమ
ర్యాదని నిల్పితి, రీవు నీయనుజు లార్యా! రామనామాంకితా!
చం||
ఎనుబదినాలుగేండ్లు చనియెన్ గడులెస్సగ; వేదపూరుషుం
డనియె శతాయువంచు; నటులౌటగొఱంత యెకింతలేక నీ
వనఘ! శతాయురున్నతి, ననామయభాగ్యముగాంచి, సత్తపో
ధనము గడించి మించుమ, నితాంత యశోనిధివై సుఖింపుమా!
చం||
పరమకృపావతారుడయి భవ్యతపోనిధియైన చంద్రశే
ఖరయతిసార్వభౌముల యఖండకృపారస మెల్లవేళదా
బరగగనీపయిన్, సకలభద్రములన్ గని, యస్మదాదులం
దఱకిని మార్గదర్శివయి, ధన్యులజేయుమి వేదవిద్వరా!
ఇట్లు,
వినీతుడు, మధురకవి
అనిపిండి వరాహనరసింహమూర్తి
విజయనగరము
2 కామెంట్‌లు:
పద్యాలు చదువుకోవటానికి హాయిగా ఉన్నాయి, బాగున్నాయి.
స్రౌత - శ్రౌత (ముద్రారాక్షసం) సరిచేయండి.
ముద్రారాక్షసిన్ జంపితి ఇపుడె నీ ఆన రాఘవా
విస్మరింపబడిన గీతారత్నమున్ గనుమవియె నిశితాలోచనమ్ముల్లతోడన్
సద్విమర్శనాదురంధరా! రాఘవా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి