శ్రీః
వ్యాస పౌర్ణమి - శ్రీముఖ ఆషాఢం
3-7-1993
శనివారం
విజయనగరం
ఆధ్యాత్మిక జీవనులు - శంకరభావనులు, బ్రహ్మశ్రీ ధవళ శ్రీరామావధాని గారికి వారి సహస్రచంద్ర దర్శనోత్సవ శుభసమయంలో గురుపూజామహోత్సవంనాడు శ్రీ శంకరమఠం - అద్వైతసభ కార్య నిర్వహకవర్గం సమర్పించు అభినందన కల్హారము
సాధుజీవనా!
ఆర్ష సాంప్రదాయ పరిరక్షణమే ధ్యేయంగా, వేదాధ్యన-బోధనలే లక్ష్యంగా, ప్రస్థానత్రయమే జీవనప్రస్థానంగా సాగుతున్న మీ జీవితం ఆధ్యతన మానవాళీకి ఆదర్శనీయం. ఆ బాల్యం వైదిక నిష్ఠావర్తనువై ధర్మో రక్షతి రక్షితః అన్న ఆర్ష సూక్తికి నిదర్శనంగా నిండుజీవితాన్ని పండించుకున్న మీ వ్యక్తిత్వం అస్మదాదులకు ఆదర్శనీయం
లోక కల్యాణ హితైషీ! మనుషుల మహర్షీ!
ఎనిమిదిన్నర దశాబ్దాలకు పూర్వం, గుడివాడ గ్రామంలో, నరసమ్మా వెంకటసోమయాజి పుణ్యదంపతుల గర్భశుక్తిముక్తాఫలంగా ప్రభవించినమీరు ప్రాథమిక విద్యాభ్యాసానంతరం, సాలూరు - విశాఖ - విజయనగరాలలో వేదాధ్యయన సంపన్నులైనారు. పరమగురువులు బ్రహ్మశ్రీ ఆర్యసోమయాజుల పార్వతీశ్వర అవధాని గురుచరణుల అంతేవాసులై గురుప్రభోధిత ప్రస్థానంలో ఎంతో వాసిగాంచారు. తొలుత విజయనగర సంస్థాన వేంకటేశ్వరాలయంలో వేదపారాయణ నిర్వహణం, తరువాత రాజపురోహితులు బ్రహ్మశ్రీ ద్వారకాభమిడిపాటి సుబ్రహ్మణ్యశాస్త్రివర్యుల సహవాసంతో రాజకుటుంబ ధర్మకార్యాచరణం, ఆపై కంచి పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వాములవారి విజయనగర ఆగమనంతో, వారి శుశ్రూషాభాగ్యంతో, వారి అంతేవాసిత్వం, డాక్టర్ బెజవాడా గోపాలరెడ్డిగారి సమక్షంలో శంకర ప్రతిష్ఠా నిర్వహణంతో శంకరమఠాన్ని రిజిష్టరు చేయించి నేటివరకూ శ్రీ శంకరమఠ సర్వతోముఖాహివృద్ధికై అహోరాత్రాలు కృషి చేసే మీరు, మనుషలలో మహర్షులు. లోక కల్యాణ సంధాతలు.
ఇవికాక, శృంగేరీ పీఠాధిపతులు, కుర్తాళం స్వామివారు, ఉడిపి దక్షిణాదిమఠం స్వామి వారు, జియ్యరుస్వామివారిచేత సత్కరింపబడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం, స్థానిక రోటరీ లయన్స్ క్లబ్ ల వారు కూడా సత్కరించారు.
ఆర్ష విద్యాభూషణా!
వైదిక మార్గ నిష్ఠా ధవళయశోవిరాజితం మీ గేహం. ఋగ్వేద యజుర్వేద స్మార్తాధ్యయన విభాసితం మీ దేహం. రాష్ట్ర రాష్ట్రేతరాల్లో మీరు గావించిన ప్రతిష్ఠలు విజయనగర వైదికలోకానికే ప్రతిష్ఠాకారకాలు.
కంచిపరమాచార్యుల శతజయంత్యుత్సవ వత్సరంలో వ్యాసభగవానుని జయంతి పర్వదినాన సహస్రచంద్రదర్శనోత్సవాభిరామువైన మీకు శతశరద్దర్శనోత్సవాన్ని కూడా నిర్వహించే అదృష్టాన్ని మాకు ప్రసాదించమని ఆ వేదపురుషుణ్ణి వేడుకుంటున్నాం.
మీ జన్మవంశ విద్యావంశాలు కల్యాణపరంపరతో కలకలలాడాలి. సర్వేశ్వరుడు మీకు శతవర్షాధిక ఆయుర్భాగ్యంతో ఇతోధిక ఆరోగ్య భోగభాగ్యాలు ప్రసాదించిగాక!
భవదీయులు
శ్రీ శంకరమఠ కార్యనిర్వహకులు
విజయనగరం
2 కామెంట్‌లు:
నాయనా శుభమస్తు.
http://andhraamrutham.blogspot.in/2012/02/blog-post_06.html
all the best
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg
కామెంట్‌ను పోస్ట్ చేయండి