15, జనవరి 2009, గురువారం

ఆటవెలది లో మొదటిపద్యం

నేనింతవరకూ ఛందోబద్ధంగా ఎప్పుడూ రాయలేదు. నాకు ఎప్పటినుంచో ఈ కోరిక తీరని కోరికలాగే ఉండిపోయింది. ఆంధ్రామృతం వారు ఆశువుగా పద్యాలు చెప్పడం చూసి, స్ఫూర్తిపొంది ఈ ప్రయత్నం చేస్తున్నాను.

ఆటవెలది:
జఱభి నవ్వినంత, జాణతనంబంత
నెఱగి జాబిలి, విటునె మరపించె
ఉత్పలాక్షి గాంచి ఊసులుబోయెనా
వన్నె, విరిసి మెరిసి వెన్నెలగుచు

ఆటవెలది ఓ చిన్ననవ్వు విసరగానే, అందులోని జాణతనమంతా గ్రహించినా చందురుడు, రసికాగ్రేసరుడైన విటుడినే మరపించేడు. కలువల వంటి కన్నులుకల ఆ జవ్వనాంగిని చూడగానే, కలువలరేని వన్నెలు, చిన్నెలు, వెన్నలగ మారి విరిసేయి, మెరిసేయి.

పద్యం ఎన్నోరూపాంతరాలుచెంది ఆవిధంగా వచ్చింది. ఎన్నిమార్పులు, చేర్పులూ జరిగేయి, పద్యంరాయడంలో పడ్డపాట్లు గురించి తెలుసుకోవాలంటే ....


ఎలా అనేది క్రింద వివరించాను చూడండి.

ముందు రాసింది ఇది:
ఉత్పలాక్షిన్ గాంచిన, శశి ఉష సొగసుల
వన్నె, వెన్నెలందు విరిసె, మెరిసె
జఱభి నవ్విన, జాబిలి చెక్కిలి, చికి
లించిన చెలియ కలల కనుబొమ్మ

భావం:
కలువల వంటి కన్నులు గల చిన్నాదాన్ని చూసిన కలువలరేని (చంద్రుని) కాంతుల సొగసులు వెన్నెలలో విరిసి, మెరిసేయిట. ఆ సుందరాంగి నవ్వితే, చంద్రుడి బుగ్గలు, ఆమె అందమైన కనుబొమ్మల్లా బాణంవంగినట్టు సొట్టబోయాయిట.

ఆటవెలది లక్షణాలు:
1) ఒకటి, మూడు పాదాల్లో రెండు ఇంద్రగణాలు, మూడు సూర్య గణాలు ఉండాలి
2) రెండు, నాలుగు పాదాల్లో అయిదు సూర్య గణాలు ఉండాలి
3) ప్రతీ పాదంలో మొదటి అక్షరం, నాల్గవ గణంలో మొదటి అక్షరం తో "యతిమైత్రి" ఉండాలి.

వీటిని ఆధారంగా రాసిని పద్యాన్ని చూద్దాం:

మొదటి పాదం గణ విభజన:
(btw, U అంటే గురువు, I అంటే లఘువు)
  1. ఉత్పలాక్షిన్(UIUU) గాంచిన(UII), శశి(II) ఉష(II) సొగసుల(IIII)
  2. కలిపిరాస్తే UIUUUIIIIIIIIII
  3. గణాలుగా విభజిస్తే UIU, UUI, III, III, III
  4. అవివరుసగా ర, త, న, న, న
  5. ర, త లు ఇంద్రగణాలు, న సూర్య గణం
  6. ఊ, ఉ లు యతిమైత్రి కలిగిఉన్నాయ
రెండవ పాదం గణ విభజన:
  1. వన్నె(UI), వెన్నె(UI) లందు(UI) విరిసి(III), మెరిసె(III)
  2. కలిపిరాస్తే UIUIUIIIIIII
  3. గణాలుగా విభజిస్తే UI, UI, UI, III, III
  4. అవిఅన్నీ గలము, గలము, , గలము న, న (, గలము అంటే "గురువు+లఘువు"అని)
  5. "గలము", "న" ఇవి మాత్రమే సూర్య గణాలు
  6. వ, వి లు యతిమైత్రి కలిగిఉన్నాయ
మూడా పాదం గణ విభజన:
  1. జఱభి(III) నవ్విన(UII), జాబిలి(UII) చెక్కిలి(UII), చికి(II)
  2. కలిపిరాస్తే IIIUIIUIIUIIII
  3. గణాలుగా విభజిస్తే III, UII, UII, UI, III
  4. అవిఅన్నీ న,భ, భ, గలము, న, గణాలు
  5. "గలము", "న" ఇవి మాత్రమే సూర్య గణాలు, మిగతావి ఇంద్రగణాలు
  6. జ, చె లు యతిమైత్రి కలిగిఉన్నాయ
నాల్గవ పాదం గణ విభజన:
  1. లించిన(UII) చెలియ(III) కలల(III) కనుబొమ్మ(IIUI)
  2. కలిపిరాస్తే UIIIIIIIIIIUI
  3. గణాలుగా విభజిస్తే UI, III, III, III, UI
  4. అవిఅన్నీ "గలము", న, న, న, "గలము", గణాలు
  5. "గలము", "న" ఇవి మాత్రమే సూర్య గణాలు
  6. లి, ల యతిమైత్రి కలిగిఉన్నాయ
కాని:
పెద్దలు చింతా రామకృష్ణారావు గారు, నరహరి గారు, రాఘవ గారు, , చదువరి గారు కొన్ని తప్పులు పట్టేరు వారికి నా కృతజ్ఞతలు.

అవి:
1) ఆ.వె లో మొదటి, మూడు పాదాల్లో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు వరసగా రావాలి. నేను మొదటి రాసినదాంట్లో, ordering లేదు.
2) ఆ.వె లో యతిప్రాస కుదురుతుంది. ఇంతకుముందు ఈ విషయంనాకు తెలియదు.
పై రెండు సూచనలనీ పరిగణన లోకి తీసుకొని, ముందు రాసిన పద్యాన్ని ఈ విధంగా మారిస్తే,

జఱభి నవ్వినంత, జాణతనంబంత
నెఱగి జాబిలి, విటుని మరపించె
ఉత్పలాక్షిని గనినంత, పున్నమిరేని
వన్నె, విరిసె మెరిసె వెన్నెలగుచు

వచ్చింది. మీరు గమనిస్తే, మొదటి రెండు పాదాల్లోనూ, యతి, చివరి రెండు పాదాల్లో ప్రాసయతి కి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. కానీ, ఇందులో కూడ తప్పులు ఉన్నాయి. ఆచార్యులు చింతా రామకృష్ణారావు ఎంతో వ్యయప్రయాసలకోర్చి, సవివివరంగా comments ద్వారా తెలియజెప్పేరు. వారు సూచించినవిధంగా రెండో పాదంలోను, మూడోపాదంలోనూ యతిని సరిచేస్తే వచ్చినది:

జఱభి నవ్వినంత, జాణతనంబంత
నెఱగి జాబిలి, విటునె మరపించె
ఉత్పలాక్షి గాంచి ఊసులుబోయనా
వన్నె, విరిసి మెరిసి వెన్నెలగుచు


నేను పైనవ్యక్తపరచినవి ఒక చిన్న పుస్తకం చూసి నేరుచుకుని, extrapolate చేసినవి. నాకు వీటిమీద పెద్దగా జ్ఞానంలేదు. పదోతరగతి వరకు కొంచం తెలుగు వ్యాకరణం చదువుకొన్నాను. ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్ధూలం ఇవి మాత్రమే చదివినట్టుగుర్తు. అవిమరచిపోయి దశాబ్దంపైగాకావస్తోంది. అందుకే, ఒక వ్యాకరణ పుస్తకం ముందు పెట్టుకొని, కొంచం practice చేసాను. తెలిసిన పద్యానికి, గణవిభజన వగైరాలని. పద్యం ఇస్తే, అది కోవలోకి వస్తుందోచెప్పడం వరకూ పర్వాలేదు, కానీ, సూత్రాలని అనుసరిస్తూ రాయడం మాటలు కాదు అని తెలిసుకున్నాను. అప్పుడు, మన కవులమీదా అమాంతం గౌరవభావం, ఆరాధ్యనాభావాం ఉన్నదానికి ఒక వెయ్యిరెట్లు పెరిగాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తిలేదు.

నేను పైన రాసిన నాలుగు పదాలు చాలా వరకు trial & error తరువాత వచ్చినవి. ఎలాఅంటే:

స్థూలంగా ముందు ఒక భావంకొని, rough draft తయారుచేసి, లఘువులుగా, గురువులుగా, విభజించి, గణాలు గుర్తించాలి. తరువాత అవి ప్రాధమిక సూత్రాలకి అణుగుణంగా ఉన్నాయోలేదో చూసుకోవాలి. అలా లేకపోతే నానార్ధాలో, పర్యాయపదాలో వాడడం, లేదూ అంటే వ్యాక్యాన్ని direct/indirect speech, active/passive voice లాగ మార్చడం, ఇంకా కుదరకపోతే, కొంచం భావమార్చడం చెయ్యాలి. నామటుకు, ఇదొక maths puzzle లా అనిపించింది. ఆటవెలది లో, ఉండాల్సినవి సూర్యగణలు (మొత్తం 2), ఇంద్రగణాలు(మొత్తం 16). గణవిభజన (parsing) ఎలాగైనా చెయ్యొచ్చు (మొత్తం 5 గణాలు ఉండేలా చూసుకోవాలి). కాబట్టి చాలా freedom ఉంది. ముందు ఒక రెండు పదాలు, చివర పదం అనుక్కొని, మధ్యలో ఏఏ పదాలు పడతాయో permutations ద్వారా ప్రయత్నించొచ్చు. ఇవి నేను try చేసిన methods. కావునా, handle with care :)


ps: వ్యాకరణం, ఛందస్సు తెలిసినవారు ఇందులో ఏవైనా తప్పులుంటే సరిదిద్దగలరు.

11 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

టపా బాగుంది. పద్యంలో గణాలు మరోసారి చూడాలేమోననిపిస్తోంది. పెద్దలెలాగూ చెబుతారులెండి!

కానీ టపా శీర్షికతోటే -ఊదం గారు ఏమంటారోనని..! :)

Chari Dingari చెప్పారు...

నాకెందుకో మీరు మొట్ట మొదలే చాలా బరువైన ఆటవెలదిని ఎత్తుకున్నారనిపించింది...కాని చాలా అందమైన పద్యం...ఆటవెలది...అలతి అలతి పదాలతో ఉంటుంది ఎప్పుడూ...ఇలాగ

అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు

తినగ తినగ వేము తియ్యనుండు

సాధ నమున పనులు సమకూరు ధర లోన

....................



నాకు మా టీచర్ ఈ క్రింది సూత్రమ్ చెప్పారు


ఇనగన త్రయంబు ఇంద్ర ద్వయంబును

హంస పంచకంబు ఆటవెలది


నేను రాసిన ఆట వెలది చూడండి....


నిన్నె వలచి నాను నీరేజ నేత్రికా

మనసు దోచి నట్టి మగువ నీవె |

కనులు మూసి నంత కలలోకి వచ్చేవు

నిన్ను మరువ లేను నిజము సుమ్మి ||

జిగురు సత్యనారాయణ చెప్పారు...

అసంఖ్య గారు,
మీరు చెప్పిన ఒకటి, మూడవ పాదాలలోని ఇంద్ర,సూర్య గణముల వరస సరి కాదు.
మొదట మూడు సూర్య గణములు తరువాత రెండు ఇంద్ర గణములు.
(ఇనగన త్రయంబు ఇంద్ర ద్వయంబును)

అసంఖ్య చెప్పారు...

@చదువరి: కవితవంలో ఈమాత్రం సరసానికి చోటు ఉండాలికదండి.

@నరహరి: మీరు రాసిన పద్యం చాలా సరళంగా బావుంది. అలాగే మీరిచ్చిన సూత్రం కూడా బావుంది. కానీ, హంస పంచకంబు అంటే ఏమిటో కొంచం వివరిస్తారా?

@జిగురు సత్యనారాయణ: అమూల్యమైన సూచన చేసారు. ధన్యవాదాలు. తప్పుని దిద్ది మళ్ళీ పద్యం రాసాను.

ఇలా వచ్చింది:

జఱభి నవ్వినంత, జాణతనంబంత
నెఱగి జాబిలి, విటుని మరపించె
ఉత్పలాక్షిని గనినంత, పున్నమిరేని
వన్నె, విరిసె మెరిసె వెన్నలగుచు

రాఘవ చెప్పారు...

“ఇనగణత్రయంబు నింద్రద్వయంబును౹ హంసపంచకంబునాటవెలది౹”
ఈ సూత్రం కూడ ఆటవెలదిలోనే ఉంది. అదీ గమ్మత్తు. మరో విషయం, ఇనుడన్నా హంసుడన్నా సూర్యుడే.

మొదటి యత్నములోని ముచ్చట్లు చక్కగా
చెప్ప... నాకు మరల స్మృతికి వచ్చె
నేను ఆటవెలది నేర్చిన రోజులు
విశ్వదాభిరామ వినురవేమ :)

అసంఖ్య చెప్పారు...

@రాఘవ గారూ. ధన్యోస్మి. మీరు ఒక రెండు నిముషాల్లో పద్యన్ని రాసి పడేస్తున్నారు, వాహ్, వాహ్, నాకు కొన్ని గంటలు పడుతోంది, నాలుగు వాక్యాలు రాయడానికి :)

ఊకదంపుడు చెప్పారు...

చదువరి గారూ :)
నే పద్యం చదివి వ్యాఖ్య రాద్దమనుకూంటే మొదట మీ వ్యాఖ్య..
అసంఖ్య గారు, మీ ఆటవెలది అనుభవాలు, అసంఖ్యాకమవ్వాలని కోరుకొవాలా? అసంఖ్యాకం కాకూడదని కోరుకోమంటారా?

కవిత్వం లో కాస్త సరసం కాస్త సత్యం అవసరమే కానివ్వండి
భవదీయుడు
-ఊకదంపుడు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సోమశేఖరా! సత్కవితాభివృద్ధిరస్తు.
ఆటవెలది:-
జఱభి నవ్వినంత, జాణతనంబంత
నెఱగి జాబిలి, విటుని మరపించె
ఉత్పలాక్షిని గనినంత, పున్నమిరేని
వన్నె, విరిసె మెరిసె వెన్నలగుచు

మీరు సరిచేసిన పై పద్యం చక్కగావుంది. ఐతే
1) రెండవ పాదంలో యతినొక్క మారు గమనించండి.
నెఱగి లో న్ + ఎ అని హల్లు + అచ్చు వున్నాయి. మొదటి హల్లు ముందు పాదంలోనిది. దానితో కూడిన అచ్చు తరువాత పాదం లోనిది..
రెండవ పాదమునకు సంబంధించిన ప్రారంభాక్షరం అయిన అచ్చుకే యతి వేయాలి.
అంటే అ అనే అచ్చు తో సరిపోయే అ - ఆ - ఐ - ఔ. అనే అచ్చులే రావాలి. పూర్వ పాదాంత హల్లేదైనా పరవాలేదు. దానితో కలిసి ఇవి రావచ్చును.
ఒక వేళ ప్రాసాక్షరానికి యతి వేశారా అనుకొంటే ర్ అనే హల్లు కి - ఱ్ అనే హల్లుకి యతి మైత్రి లేదు. యతి మైత్రి లేని వాటికి యతి వేయడం సరి కాదు.
2) మూడవ పాదంలో " ఉత్ప - నంత " అనే యతి స్థానము లేదా ప్రాస యతి స్థానము లలో వాడినవి కూడా సరి చూడాలి.
ఉత్ అనేది యతి అక్షరము యతిస్థానములో నంత { న్ + అంత } లో నకార్ పొల్లు పూర్వ పదాంతహల్లు. అంతలో అ అనేది పర పద ఆది అచ్చు.. అంటే ఉ అనే అచ్చుకి యతి స్థానంలో మిత్ర అచ్చయిన ఉ - ఊ - ఒ - ఓ. లలో ఏదేని అచ్చు వుండవచ్చును. కాని అ అనే అచ్చు సరి పడదు.
పోనీ ప్రాస యతి వాడారనుకొందామా అంటే
రెండవ అక్షరం త్ప .
ప్రాస యతిస్థానంలో త్ప అనే సం యుక్త హల్లే రావాలి.
మీకున్న ఉత్సాహాన్ని చూచి చక్కని మార్గంలో ముందునుంచీ నేర్చుకోగలుగే కోరిక మీకుంటుందనే నేనింత వివరంగా వ్రాశాను.
బోరు కొట్టిందనుకొంటే మన్నించగలరు.

అలాగే రాఘవ కూడా
మొదటి యత్నములోని ముచ్చట్లు చక్కగా
చెప్ప... నాకు మరల స్మృతికి వచ్చె
నేను ఆటవెలది నేర్చిన రోజులు
విశ్వదాభిరామ వినురవేమ :)

అనేపద్యంలో మొదటి పాదంలో ములోని అనే అక్షరాల్ని మండు అని వ్రాస్తే గణం సరిపోతుంది.
అలాగే చివర పాదాన్ని వేమన కంటగట్టడం సరయినదికాదు. హాయిగా స్వీయ తేజం చివరి పాదంలో వ్యక్తమయేలాగ చెప్పితే అద్భుతంగా వుంటుంది.
ఉభయులకూ అభినందనలు.
{ ఆంధ్రామృతం బ్లాగ్ }
abcdefgh

రాఘవ చెప్పారు...

రామకృష్ణారావుగారూ, నేను పద్యం వ్రాసేటపుడే సరిచూచుకోవడం అలవాటు చేసుకోవాలండీ. సరిచేసినందుకు నెనరులు.

వడిని వ్రాతునంచుఁ బద్యమున్ మొదలిడఁ
బప్పులోన నకట పడెను కాలు
దొలిచి వెలదిలోనఁ దూరెగా సీసంబు
ఏమి చేయగలను ఇపుడు చూసి?

ఇక వేమనకి అంటగట్టడమంటారా, దానికి దేవులపల్లివారు స్ఫూర్తి. ఇల్లాంటివి వినేఉంటారు...

మెరుగుకళ్లజోళ్లు గిరజాలు సరదాలు
భావకవికి లేని వేవి లేవు
కవితయందు తప్ప గట్టివాడన్నింట
విశ్వదాభిరామ వినురవేమ

ఐనా మానేస్తానులెండి. నా తప్పుల్ని వేమనకి అంటగట్టకూడదు కదా.

అసంఖ్య చెప్పారు...

@చింతా రామకృష్ణారావు గారూ:

ఆచార్యులకు నమస్కారాలు. మీరు ఎంతో శ్రమకోర్చి మాకు పద్యాలు నేరుపుతున్నందుకు మీకు ఎంతో ఋణపడివున్నాము. నేను కూడ బ్లాగులో "నేనుపద్యం ఎలా రాసాను, గణవిభజన ఎలా చేసాను" అని వివరించడనికి కారణం, ఇంకవెరైనా చూసి, చేసినతప్పుల నుంచి నేర్చుకోవచ్చనే ఉద్దెశ్యంతోనే. ప్రయత్నంలో లోపం లేకపోతే, నేర్చుకోలేనిది అంటూ ఏమీ లేదు, నా దృష్టిలో.

నాకు ఇంకొన్ని సందేహాలు ఉన్నాయి:
ఉత్ప లో "త్ప" సంయుకాక్షరం కదా, నేను చదివిన పుస్తకంలో, యతి, అందులో ఏ రెండు అక్షరాలకైనా వేయచ్చు అని ఉంది ( ఈ ఉదాహరణలో, త గానీ, ప గానీ). అందుకే "నంత" అనిరాసాను. కానీ మీరు ఖచ్చితంగా "త్ప" నే రావలని అంటున్నారు కదా?

సరి చేసినతరువాత ఇలా:

జఱభి నవ్వినంత, జాణతనంబంత
నెఱగి జాబిలి, విటునె మరపించె
ఉత్పలాక్షి గాంచి ఊసులుబోయెనా
వన్నె, విరిసి మెరిసి వెన్నెలగుచు

@ఊకదంపుడుగారు: మరి నన్ను ఏమని కోరుకోమంటారు? మీరూ సార్ధకనామధేయులు కావాలనా, కావొద్దనా? :)

ఊకదంపుడు చెప్పారు...

సోమశేఖర్ గారూ:

పెద్దప్రశ్నే లేవనెట్టారే..
ఏమైనా, ప్రశ్నను మరో ప్రశ్నతో దాటవేస్తున్నారంటే అవధానానికి ఓ మెట్టు దగ్గరైనట్టు...

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును