చాలారోజుల క్రితం, ఒక కాలేజీకి సంబంధించిన వీడియో ఏమైనా దొరుకుతుందేమనని యూట్యూబ్ లో వెతికా - అసలు ఇప్పుడు కాలేజి ఎలావుందో అని. ఏవో కొత్త ఆడిటొరియం కట్టేరుట అవీ, ఇవీ అని. దొరికింది.
ఏదో వార్షికదినోత్సవం కాబోలు. స్పూఫ్ లు, సినిమాపాటలకి డాన్సులకి బదులు, చిత్రంగా, సంగీతకచేరి జరుగుతున్నట్టుగా అనిపించింది. *** కాలేజీ డే నాడు శాస్త్రీయసంగీతకచేరీయా? ఏమిటీ శుభపరిణామం అనుకొంటూండగానే, వీడియో ఫోకస్ మరోచోటుకి మారింది. కొంతమంది "విద్యార్ధుల గుంపు" పైకి. మీద కచేరీ జరుగుతూంటే, కింద తీన్-మార్ కి శవానికి ఊరేగింపులాంటిది చేస్తూ, "enjoy" చేస్తున్నారు.
కాలం కొంచెం వెనక్కి వెళ్ళింది. నేనుతినే సొల్లుగడ్డి ఏమైనా తక్కువా అని, ఒక సినీ "అప"హాస్యనటుడు, ఇంజనీరింగ్ కాలేజెలో తాగి తూలి ఏవో పేల్తున్నాడు.
కాలం మరింత వేగంగా వెనక్కి వెళ్ళింది. ట్యాంక్ బండ్ మీద కొన్ని విగ్రహాల్ని కొంతమంది “విప్లవకారులు" కూల్చెస్తున్నారు.
పై మూడు సంఘటనల్లో నాకు పెద్ద తేడా కనిపించలేదు. మనకు నచ్చకపోయినా, వంటపట్టకపోయినా, అది మన వారసత్వసంపద అని గుర్తెరగకపోయినా, కనీసం వాటి విలువేంటో తెలుసుకొంటేచాలు. అదీ కొరవడిందీరోజుల్లో.
మొదటిరెండు సంఘటనలు జరిగినవి తెలంగాణాలో కావు - సినిమాల్లో అత్యంత రొమాంటిగ్గా, ప్రత్యేక తెలంగాణావాదుల హృదయాలు గాయపడేలా, తెలుగుదనానికి పట్టుకొమ్మలు ఇవిమాత్రమే అనిపించేవిధంగా చూపబడే ప్రాంతాల్లోనే జరిగాయి. కనీసం ట్యాంక్ బండ్ మీద జరిగినదానికి, మంచో చెడో, ఒక ప్రేరణైనా ఉంది. కొంతమంది వ్యక్తుల దురాలోచనవల్ల మాత్రమే జరిగింది. మిగతావి చాలా సాధారణంగా జరిగినట్టు అనిపిస్తాయి. కానీ వాటి వెనకనున్న సమస్య ఒక్కటే.
మనం విచారించవలసిని విషయం, ఆలోచించవలసిన విషయం, ట్యాంక్ బండ్ విగ్రహాల పై దాడికన్నా తీవ్రమైన, విషమమైన సాంస్కృతిక రంగాలపై నిర్లిప్తత, నిరాశక్తత, అవగాహనారాహిత్యాలపై. కంటికి కనిపించకుండా ధ్వంసమవుతున్న జాతి మూలాలపై.
సమాచారవిప్లవం వచ్చినతర్వాతకూడా, వీటిని పరిరక్షించే బాధ్యతతీసుకోకుండా, కాపాడే హక్కుకోసం పోరాడ్డం - ఉన్న పరిమితవనరుల్ని దుర్వినియోగపరచడమే అవుతుంది. ఆ పరిస్థితులు నెలకొల్పనంతవరకూ -
విలువ లేని చోట విగ్రహమేల? చలువలేనిచోట చేరనేల?
1 కామెంట్:
well said
కామెంట్‌ను పోస్ట్ చేయండి